జగిత్యాల: రాజకీయాలకతీతంగా మున్నూరుకాపుల ఐక్యతే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, వెబ్సైట్లో ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని మున్నూరుకాపుల సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు దేవయ్య పటేల్ అన్నారు. శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంఘాల ఏర్పాటు, నాయకత్వ నిర్మాణంలో భాగస్వామ్యం వహించామని పేర్కొన్నారు. మున్నూరుకాపుల జనాభాకు సంబంధించి వివిధ సర్వేల్లో భిన్నమైన గణాంకాలు వెలువడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 51 లక్షలు ఉండగా, కుటుంబ సమగ్ర సర్వేలో 25 లక్షలు నమోదైందని, తాజా కులగణనలో కేవలం 13 లక్షలే చూపించారన్నారు. ప్రతి ఒక్కరి వివరాలు ఉండాలన్న ఉద్దేశంతో డిజిటల్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు వెబ్సైట్ పోస్టర్ ఆవిష్కరించారు. రైతు సంఘం అధ్యక్షుడు సత్తన్న, రవీందర్, రాజేశ్, వంగల రమేశ్, లింగారెడ్డి, గంగాధర్, పాము సత్యం పాల్గొన్నారు.


