కథలాపూర్(వేములవాడ): చేయూత పింఛన్లు అర్హులైన వారికి మంజూరు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన మండలస్థాయి అధికారులు గ్రామాలకు వెళ్లి వారి స్థితిగతులు, సర్టిఫికెట్లను యాప్ ద్వారా పరిశీలించారు. అనర్హులుగా తేలిన కొందరి దరఖాస్తులను ప్రాథమిక స్థాయిలోనే తిరస్కరించారు. అనంతరం అర్హుల జాబితాలను ఎంపీడీవోలకు అందించగా.. వారు ధ్రువీకరించి జిల్లా అధికారులకు పంపించారు. తాజాగా మరింత లోతుగా పరిశీలించేందుకు ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో జిల్లాస్థాయి అధికారిని నియమించారు. జిల్లా అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటించి ర్యాండమ్‌గా ఎంపిక చేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే ప్రక్రియ ప్రారంభించారు.
17,494 చేయూత దరఖాస్తులు
జిల్లాలో చేయూత పింఛన్ల కోసం 17,494 మంది దరఖాస్తు చేసుకున్నారు. మండలస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినప్పటికీ అనర్హులున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారులు పకడ్బందీగా విచా రణ చేస్తున్నారు. మండల, జిల్లాస్థాయి అధికారుల పరిశీలన తర్వాత ఇప్పటి వరకు 3,238 దరఖాస్తులను తిరస్కరించారు. ఇంకా జిల్లాస్థాయి అధికారులు ర్యాండమ్‌గా తనిఖీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త పింఛన్లను దసరా పండుగ నాటికి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. దసరా పండుగ అయిపోయినప్పటికీ స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది.
మరోసారి విచారణ: రఘువరణ్, డీఆర్డీవో
చేయూత పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి మండలస్థాయి అధికారుల విచారణ పూర్తయింది. అర్హులకు పింఛన్లు అందించాలని జిల్లాస్థాయి అధికారులతో దరఖాస్తులను గ్రామాల్లో ర్యాండమ్‌గా విచారణ చేయిస్తున్నాం. వీలైనంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తయ్యాక కొత్త పింఛన్లు మంజూరవుతాయి.
క్షేత్రస్థాయిలో మరోసారి విచారిస్తున్న అధికారులు
జిల్లాలో 17,494 మంది పింఛన్లకు దరఖాస్తు


