ధర్మపురి: జ్వరంతో బాధపడుతూ.. వైద్య చికిత్స చేయించుకున్నప్పటికీ యువకుడి మృతిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. మృతుని సోదరుడు, వైద్యుల కథనం ప్రకారం.. ధర్మపురి మండలం రాజారం గ్రామానికి చెందిన వేమునూరి వినిత్ (35) ఈ ఏడాది ఆగష్టు 27న జ్వరం రావడంతో ధర్మపురిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు ఇచ్చిన వైద్యంతో పరిస్థితి విషమించగా.. జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే నెల 28న మృతిచెందాడు. ఆర్‌ఎంపీ వైద్యం వికటించడంతోనే వినిత్ చనిపోయాడని అతడి సోదరుడు ప్రవీణ్ పోలీస్‌స్టేషన్, డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గురువారం డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ ఆధ్వర్యంలో మృతుడి నివాసం వద్దకు వెళ్లి సర్పంచ్, భార్య, కుటుంబ సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టారు. ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న రికార్డులు, కుటుంబసభ్యుల నుంచి సమాచారం సేకరించారు. నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు సమర్పిస్తామని శ్రీనివాస్ తెలిపారు.


