జగిత్యాల: ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలని, తాగు, సాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, అదనపు కలెక్టర్‌తో కలిసి అధి కారులతో సమావేశమయ్యారు. జిల్లాలో 21శాతం లోటువర్షపాతం ఏర్పడిందన్నారు. యాసంగిలో వరి సాగు తగ్గించాలన్నారు. తక్కువ నీటితో పండే పంటలు ఎంచుకోవాలని రైతులకు సూచించారు. ఆర్నెళ్ల పాటు కొత్త బోర్లు వేయకుండా చూడాలన్నారు. వీబీజీరాం పథకం కింద ఇంకుడుగుంతలు, నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రజారోగ్యంపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మిషన్ భగీరథ సమస్యలను పరి ష్కరించాలని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 20,260 కిలోలీటర్లు అవసరం కాగా.. ప్రస్తుతం 12,900 కిలోలీటర్లు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. చేతిపంపులు, బోర్లకు మరమ్మతు చేయాలన్నారు. పైప్‌లైన్ లీకేజీలు, మున్సిపాలిటీలో తాగునీటి పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కరాల పనులను పూర్తి చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ ప్రసూనాంబ, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
వియత్నాం అంశాలను అమలు చేయాలి
వియత్నాం దేశంలో విద్యాసంస్థలను సందర్శించి అక్కడ తెలుసుకున్న అంశాలను జిల్లాలో అమలు చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. ఎడ్యుకేషనల్ టూర్‌లో భాగంగా వియత్నం వెళ్లివచ్చిన ఉపాధ్యాయులను మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రాము, అకడమిక్ మానిటర్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి బోయినిపల్లి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
ధర్మారంలో అభివృద్ధి పనుల పరిశీలన
కోరుట్లరూరల్: కోరుట్ల మండలం ధర్మారం గ్రామాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. జలసిరి, నీటికుంటల పనులు పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యత చూశారు. అంగన్‌వాడీ పిల్లలతో ముచ్చటించారు. భూ రీసర్వే పనుల పురోగతిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. సర్పంచ్ రంజిత్‌రెడ్డి, డీఆర్‌డీవో రఘువరన్, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.


