జగిత్యాల: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రానున్నరోజుల్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనుల సంఖ్య పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవా రం కలెక్టరేట్‌లో వీబీజీరాంజీ ఉపాధిహామీ పనులు, జల సంరక్షణ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం రోజువారిగా సగటున 60 మందికి ఉపాధిపని కల్పిస్తున్న నేపథ్యంలో ఆ సంఖ్యను స్థిరంగా కొనసాగించాలన్నా రు. కాలువల్లో పూడికతీత పనులు విస్తృతంగా చేపట్టాలన్నారు. ఫాంపాండ్ నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇందులో 1,250 మంజూరు కాగా 828 పనులు మాత్రమే పూర్తయ్యాయని, రెండునెలల్లో పూర్తి చేసేలా చూడాలన్నారు. జలసంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు దోహదపడే మ్యాజిక్‌సోక్ పిట్స్, కమ్యూనిటీ సోక్‌పిట్స్‌ను ఈనెల 31 వరకు పూర్తి చేసేలా చూడాలన్నారు. బోర్‌వెల్ రిచార్జీ నిర్మాణాలకు సంబంధించి 118 మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. వ్యక్తిగత మరగుదొడ్ల నిర్మాణాలను వెనువెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, మొదటి విడతలో మిగిలి ఉన్న 860 ఇళ్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. రెండో విడతలో 6,725 ఇళ్లకు సంబంధించిన ప్రతిపాదనలు మంజూరుకు పంపినట్లు వెల్లడించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీఆర్‌డీవో రఘువరణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


