జగిత్యాల: విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలు వివరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలలకు బతుకమ్మ నిధులు మంజూరు చేసింది. సెలవులకు ముందురోజే పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 16 పీఎంశ్రీ హైస్కూల్స్, నాలుగు ప్రైమరీ హైస్కూళ్లు ఉండగా ఒక్కో పాఠశాలకు రూ.10 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. దసరా సెలవుల సందర్భంగా విద్యార్థులు ఇంటికి వెళ్తారనే ఉద్దేశంతో ముందస్తుగా వేడుకలు నిర్వహించారు. సదరు నిధులతో బతుకమ్మల కొనుగోలు, ముగ్గులు, ఫ్లెక్సీలు, సౌండ్‌సిస్టం, కోలాటాలు తదితర వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా, జిల్లాలోని 20 పాఠశాలల్లో ఈ వేడుకలు నిర్వహించారు. ముందుగా హెచ్‌ఎంలు, ఎస్‌వోలు ఖర్చుపెట్టి అనంతరం ఎస్టీవో ఆఫీసు నుంచి బిల్లులు తీసుకోవాల్సి ఉంటుంది.
ఖర్చులపై ఆరోపణల వెల్లువ
పీఎంశ్రీ పాఠశాలల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఖర్చులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా స్కూళ్లకు రూ.10 వేల నిధులు రాగా.. కొన్ని స్కూళ్లలో అంతగా ఖర్చు చేయనట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో రూ.10 వేల లోపే ఖర్చు చేసినట్లు తెలిసింది. జిల్లాస్థాయి అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. పీఎంశ్రీ స్కూళ్లకు బతుకమ్మ ఉత్సవాలే కాకుండా వివిధ పథకాల కింద నిధులు కేటాయిస్తారు. వార్షికోత్సవాలు, ఎక్స్‌పోజర్, ఫీల్డ్ విజిట్ వంటి కార్యక్రమాలకు వీటిని వెచ్చించాల్సి ఉంటుంది. కానీ.. నిధులు లేకపోవడంతో గుర్తింపు కార్డుల తయారీకి ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది.
ఒక్కో పాఠశాలకు రూ.10 వేలు
నిధుల వినియోగంపై ఆరోపణలు


