జగిత్యాలజోన్: జగిత్యాల అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. స్థానిక ఎల్ఎల్ గార్డెన్లో శనివారం రైతు సేవా సంకల్ప సదస్సు నిర్వహించారు. సింగిల్ విండో చైర్మన్‌గా కొలుగూరి దామోదర్‌రావు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు నిరంతరం రైతు సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, మార్కెట్ చైర్మన్ నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
వాకింగ్‌తో ఆరోగ్యం
జగిత్యాల/జగిత్యాలటౌన్: ఆరోగ్యం కోసం నిత్యం వాకింగ్ చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. ధరూర్ క్యాంపు వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణస్వీకారం చేయగా.. ఎమ్మెల్యే అభినందించారు. ధరూర్ క్యాంప్ ఓపెన్ జిం ఏర్పాటు చేశామని, వాకింగ్ ట్రాక్, మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు. కౌన్సిలర్ ప్రశాంత్‌రావు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఇల్లెందుల పురుషోత్తం పాల్గొన్నారు.
అన్నదాన షెడ్డుకు నిధులు
రాయికల్: మైతాపూర్లోని గన్నెగుట్టపై ఉన్న దుర్గమాత ఆలయానికి అన్నదాన షెడ్డుకు నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దుర్గమాత ఆలయంలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. దుర్గమాతను దర్శించుకున్న ఆయనను ఆలయ కమిటీ నిర్వాహకులు సన్మానించారు.


