భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు.. ఆధునిక సర్వే చేపడుతున్న ప్రభుత్వం తొలి విడతలో జిల్లాలో 70 గ్రామాలు ఎంపిక
జగిత్యాల: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు రీ సర్వే నిర్వహించి రైతులకు భూ ఆధార్ నంబరు కేటాయించేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో 70 గ్రామాలు ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద బీర్పూర్ మండలం కోమన్పల్లిలో సర్వే నంబర్ల వారీగా హద్దులు ఖరారు చేసి ల్యాండ్ పార్ట్ మ్యాప్ రూపొందించి ఆన్లైన్లో పొందుపర్చారు. తొలి విడతలో 70 గ్రామాలు ఎంపిక చేయగా, వీటిలో 20 మ్యాప్ లేని గ్రామాలు, 13 గ్రామాలు మ్యాప్ ఉన్నవి సర్వే చేస్తున్నారు. మ్యాప్ లేని గ్రామాల్లో 8 పూర్తయ్యాయి. మ్యాప్ ఉన్న 13 గ్రామాల్లో కొడిమ్యాల మండలం శనివారంపేట మాత్రమే పూర్తయింది. ఇప్పటికే నాలుగు నెలలు గడుస్తున్నా పనులు మాత్రం నెమ్మదిగా కొనసాగుతున్నాయి.
నిజాం కాలం నాటి రికార్డులే..
1936 నాటి (నిజాం కాలం నాటి) సర్వే రికార్డులే ఇప్పటికీ భూములకు ప్రధానంగా ఉన్నాయి. ప్రస్తుతం భూ వివాదాలు ఎక్కువ కావడం, భూ యజమాన హక్కుల హద్దుల విషయంలో తరుచూ వివాదాలు నెలకొనడంతో శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేపడుతున్నారు. కానీ ఆశించిన మేర పూర్తి కావడం లేదు.
లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా..
భూభారతి చట్టం పకడ్బందీగా అమలు చేయాలనే ఉద్దేశంతో లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి మొదటి విడతలో సుమారు 100 మందికి పైగా ఎంపిక చేశారు. వీరితో గ్రామాల్లో సర్వే చేయించాలని కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రీ సర్వే ఎకరాకు రూ.65 ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, సర్వే నత్తనడకన కొనసాగుతోంది.
భూవివాదాలకు తెర
ఎంజాయిమెంట్ సర్వే ద్వారా భూ వివాదాలు లేకుండా ఉంటాయి. హద్దులు కూడా సరిగ్గా గుర్తించి మ్యాప్లు ఏర్పాటు చేస్తారు. దీంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఉండవు. గతంలో ధరణి పోర్టల్లో రైతుల భూములకు సంబంధించి అనేక తప్పులు దొర్లడంతో వాటిని సరిచేయడంతో పాటు, ప్రతి ఒక్కరికి భూ ఆధార్ నంబరు ఇస్తారు. రీసర్వే పూర్తయిన అనంతరం ప్రతి భూమికి కచ్చితమైన హద్దులు నిర్ణయించడంతో పాటు, ప్రతి సర్వేనంబరుకు ప్రత్యేక భూ ఆధార్ నంబరు కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతో భూ విస్తీర్ణం, హద్దులు, యజమాన్య వివరాలపై స్పష్టత రావడంతో పాటు, భవిష్యత్లో భూ వివాదాలు తగ్గే అవకాశాలుంటాయి.
రీ సర్వేలో జాప్యం
రీసర్వే ప్రక్రియ జాప్యం లేకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఇప్పటికే గ్రామసభల నిర్వహించడంతో పాటు, ఏ విధంగా రీసర్వే చేస్తారని ప్రజల్లో అవగాహన కల్పించారు. రోజుకు 300 ఎకరాల వరకు మాత్రమే రీసర్వే చేస్తున్నారు. పూర్తిస్థాయిలో కావాలంటే ఇంకొంత మంది సర్వేయర్లను నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నవంబర్ వరకు పూర్తయ్యే అవకాశం
జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ వరకు పూర్తయ్యే అవకాశం ఉంది. రీసర్వే ద్వారా భూ వివాదాలు తగ్గడంతో పాటు, రైతులకు స్పష్టమైన హద్దులతో కూడిన రికార్డులు అందుబాటులో ఉంటాయి.
– నాగేందర్, భూకొలతల శాఖ అధికారి


