అటవీ భూముల ఆక్రమణలపై ‘విజిలెన్స్‌’ | - | Sakshi
Sakshi News home page

అటవీ భూముల ఆక్రమణలపై ‘విజిలెన్స్‌’

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

కోరుట్ల/మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో అటవీ భూములు అడ్డగోలుగా ఆక్రమణలకు గురైన వ్యవహారంపై రాష్ట్ర విజిలెన్స్‌ దృష్టి సారించింది. మండలంలోని రంగారావుపేట బీట్‌ కంపార్ట్‌మెంట్‌ పరిధిలో పచ్చని చెట్లను నరికివేసి, భూములను చదును చేస్తూ దందా సాగించిన వైనంపై ఉన్నతధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం మెట్‌పల్లి మండలం అల్లూరి సీతారామరాజుతండా (ఏఎస్‌ఆర్‌ తండా), రంగారావుపేట గ్రామాల్లోని అటవీ భూములను రాష్ట్ర విజిలెన్స్‌ బృందం పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో అటవీ భూమి ఎంత విస్తీర్ణంలో ఉంది, అందులో ఆక్రమణకు గురైంది ఎంత.. అనే వివరాలు తెలుసుకున్నారు. శాటిలైట్‌ సర్వే నిర్వహించిన అధికారులు విలేజ్‌ మ్యాప్‌ ఆధారంగా భూముల ఆక్రమణలపై తనిఖీలు చేపట్టారు. అటవీ భూములను చదును చేసి వాటిలో పంట పొలాలు సాగు చేసినట్లు గుర్తించారు. మిగతా చోట్ల చదును చేసి వదిలిపెట్టి ఉన్నట్లు విజిలెన్స్‌ బృందం దృష్టికి వచ్చింది. ఎకరాల ఎకరాలకు భూములు ఆక్రమణలకు గురికావడం, వందలాది చెట్లను నరికివేసిన వైనంపై కంగుతిన్న విజిలెన్స్‌ బృందం.. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాపు జరిపింది. 2019 నుంచి ప్రారంభమైన ఈ తంతులో అప్పటి నుంచి ఉన్న అధికారులెవరు, ఆక్రమణలను ఎందుకు ఆపలేకపోయారు.. అనే విషయాలపై ఆరా తీశారు. ఆక్రమణలకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు ఎంత మందిపై కేసులు నమోదయ్యాయి, కేసులు నమోదైన వారిలో ఎంత మంది రిమాండ్‌ అయ్యారు, ఇతరాత్ర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విజిలెన్స్‌ డీఎఫ్‌వో శివయ్య మాట్లాడుతూ, అటవీ భూముల ఆక్రమణలపై జరిపిన విచారణ నివేదికను ప్రిన్సిపాల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఛీప్‌ వినయ్‌కుమార్‌కు అందిస్తామని తెలిపారు. స్థానిక అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలపై కూడా విచారణ జరిపినట్లు పేర్కొన్నారు. ధర్మపురి ఎఫ్‌ఆర్వో శ్రీనాథ్‌, మెట్‌పల్లి సెక్షన్‌ ఆఫీసర్‌ చైతన్యశ్రీ, బీట్‌ ఆఫీసర్‌ సాయిరాం, బాసర సర్కిల్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌, విజిలెన్స్‌ బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement