లోపాలమయం.. ఆర్టీవో కార్యాలయం | - | Sakshi
Sakshi News home page

లోపాలమయం.. ఆర్టీవో కార్యాలయం

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

కోరుట్ల: పది రోజుల క్రితం.. కోరుట్లలోని ఆర్టీవో కార్యాలయం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయంలో రికార్డులు.. సిబ్బంది పనితీరు పరిశీలించిన అధికారులు ఎక్కడికక్కడ లోపాలు గుర్తించారు. డ్రైవింగ్‌ ట్రాక్‌, సిగ్నల్స్‌ లేవు. కార్యాలయంలో ఏంవీఐ ఉన్నా లేకున్నా.. అంతా కానిస్టేబుల్‌ చేతిలోనే ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. కార్యాలయంలో ఏజెంట్లదే హవా అని తెలుసుకున్నారు. ఏజెంట్ల ఫోన్‌లను పరిశీలించి ఎక్కడి నుంచి ఎక్కడికి ఫోన్‌పే వెళ్తున్నాయన్న అంశంపై విచారణ మొదలెట్టారు. ఇంత జరిగినా కోరుట్ల కార్యాలయం తీరు మారలేదు.

కొర్రీలతో కాలయాపన

ఈ నెల 6న ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టిన తనిఖీల్లో లోపాలు.. కరువైన పర్యవేక్షణ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఏసీబీ అధికారుల తనిఖీలు.. ట్రాన్స్‌పోర్ట్‌ శాఖ ఉన్నతాధికారులకు చేరిన నివేదిక ఫలితంగా పనితీరు మెరుగుపడుతుందని ఆశించినా.. ఆ దిశగా ఎలాంటి మార్పు కనిపించకపోవడం గమనార్హం. కార్యాలయంలో ఏజెంట్లు కాస్త దూరమయ్యారు. నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వారు మాత్రం నానా తిప్పలు పడుతున్నారు. గతంలో ఏజెంట్లతో ఉన్న సంబంధాలతో చకచకా పనులు పూర్తి చేసే సిబ్బంది ఇప్పుడు ఏజెంట్లు లేకపోవడంతో చిన్నచితకా సాకులు చెబుతూ సేవలు ఆపేస్తున్నారని సమాచారం. డ్రైవింగ్‌ టెస్ట్‌ కోసం ఏర్పాటు చేసిన ట్రాక్‌ అలాగే ఉంది. పర్యవేక్షణలో మాత్రం కొంత మార్పు కనిపిస్తోంది. గతంలో కానిస్టేబుల్‌ పర్యవేక్షణలో జరిగే టెస్ట్‌ ప్రస్తుతం అధికారి ఉంటేనే జరుగుతున్నాయి.

ఫోన్‌పే లెక్క తేలేనా..?

ఏసీబీ అధికారుల తనిఖీల అనంతరం కొంతమంది ప్రైవేటు ఆర్టీఏ ఏజెంట్ల సెల్‌ఫోన్లను పరిశీలించి తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు సమాచారం. కార్యాలయం పరిధిలో సుమారు 20 మంది ఏజెంట్లు ఉండగా.. వీరంతా రోజువారీగా అందించే మామూళ్లను పట్టణంలోని ఓ థియేటర్‌ సమీపంలో ఉండే ఏజెంట్‌కు ఫోన్‌పేలో పంపేవారని సమాచారం. సదరు ఏజెంట్‌ ఆ డబ్బులను రెండు, మూడు రోజులకోసారి నేరుగా కార్యాలయం సిబ్బందికి అందించేవారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో ఉన్న ఫోన్‌పేలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ దిఽశలో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

ఏసీబీ నివేదికలో వెల్లడి

ఏజెంట్ల ఫోన్‌పేలపై ఆరా

దాడుల తరువాత ప్రతీ పనికి కొర్రీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement