చిత్రంలో జనరేటర్ ద్వారా పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతు పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈరవేణి హరీశ్. నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరిసాగు చేస్తున్నాడు. చివరిదశకు చేరుకున్న పంట నీరు లేక ఎండిపోతుండగా.. కరెంటు కొరత ఇంకా ఇబ్బంది పెడుతోంది. దీంతో పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నాడు. జనరేటర్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తున్నాడు. ఇలా చేయడం వల్ల రోజు రూ.2 వేల పైచిలుకు ఖర్చు అవుతోందని హరీశ్ తెలిపాడు.
ఎల్లంపల్లిలో ప్రస్తుతం 18.2582 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా, నీటిమట్టం 147.31 మీటర్లుగా నమోదైంది. గతేడాది ఇదే రోజున పూర్తిస్థాయి నిల్వ ఉండగా, ప్రస్తుతం 1.91 టీఎంసీల నీరు తక్కువగా ఉంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 55.569 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండీ)లో ప్రస్తుతం 15.485 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, నీటిమట్టం 277.08 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి నీటి ప్రవాహం లేదు. మిషన్ భగీరథ, ఈవీపీ అవసరాలకు కలిపి 246 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మిడ్ మానేరులో ప్రస్తుతం 23.462 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, నీటిమట్టం 316.35 మీటర్లుగా నమోదైంది. ఎగువ నుంచి నీటి ప్రవాహాలు లేవు. జలాశయం నుంచి 157 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


