మెట్‌పల్లి: పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపూలే బీర్‌పూర్ బాలుర గురుకులం పాఠశాలను శనివారం సీనియర్ సివిల్ మేజిస్ట్రేట్ అజయ్‌కుమార్ సందర్శించారు. వంటగది, తరగతిగదులు, వసతి, స్టోర్, వాష్‌రూంలను పరిశీలించారు. పరిశుభ్రత పాటించకపోవడం.. విద్యార్థులకు తగిన సౌకర్యాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలపై విద్యార్థులను ఆరా తీశారు. ఉపాధ్యాయులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట మెట్‌పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలేటి రాంరెడ్డి, న్యాయవాదులు ఉన్నారు.
దుబ్బ రాజన్నకు రూ.19.29లక్షల ఆదాయం
జగిత్యాలరూరల్: సారంగాపూర్ మండలం పెంబట్లకోనాపూర్‌లోని శ్రీదుబ్బరాజేశ్వరస్వామికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేవాదాయ శాఖ డివిజనల్ అధికారి రాజమౌళి పర్యవేక్షణలో శనివారం లెక్కించారు. రూ. 19, 29,599 ఆదాయం సమకూరింది. 19యూఎస్ డాలర్లు, 630 యూఏఈ ధరమ్స్ వచ్చా యి. ఈవో అనూష, ఫౌండర్ చైర్మన్ పొరండ్ల శంకరయ్య, సర్పంచులు, ధర్మకర్తలు పాల్గొన్నారు.
చేనేత కార్మికులందరికీ పెన్షన్ వర్తింపజేయాలి
● ఎమ్మెల్సీ ఎల్.రమణ
జగిత్యాల: చేనేత కార్మికులందరికీ పెన్షన్ పథకం వర్తింపజేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. జియో ట్యాగింగ్ సవరించాలని, జియో ట్యాగింగ్ ద్వారా గుర్తింపు పొందిన చేనేత కార్మికులను మాత్రమే లబ్ధిదారులుగా పరిగణిస్తుండటంతో నిజమైన కార్మికులు పథకానికి దూరం అవుతున్నారని తెలిపారు. తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.
అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు
● ధర్మపురి రేంజ్ అధికారి శ్రీనాథ్
జగిత్యాలక్రైం: అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ధర్మపురి రేంజ్ అధికారి శ్రీనాథ్ అన్నారు. బీర్‌పూర్ మండలం నర్సింహులపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అసునూరిగూడెంకు చెందిన ఏదుల రామన్న సాగు చేస్తున్న అటవీభూములకు శనివారం హద్దులు ఏర్పాటు చేశారు. అనధికారికంగా సాగుచేసిన భూములను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, ఆక్రమణలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ట్రెంచ్‌లు (కందకాలు) ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూములు ఆక్రమించిన వారిని తహసీల్దార్ ముందు బైండోవర్ చేశామన్నారు. నిందితుడు ఏర్పాటు చేసిన సోలార్ సీసీకెమెరాను సీజ్ చేసి తదుపరి చర్యలకు ఆదేశించామని వెల్లడించారు. అటవీచట్టం ప్రకారం అటవీ భూముల్లో అనధికారికంగా ప్రవేశించడం.. భూమిని చదును చేయడం నిషేధమన్నారు.
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
ధర్మపురి: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తుంగూరి సురేశ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గజభీంకార్ గోవర్ధన్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం సభ్యత్వ నమోదు చేపట్టారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయిని విజయానంద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దాసరి భీమయ్య, మండల అధ్యక్షుడు బండారి సతీష్, ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్ తదితరులున్నారు.


