చదువు సాగాలి | - | Sakshi
Sakshi News home page

చదువు సాగాలి

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

ఈనెల 5న దివ్యాంగ పిల్లల గుర్తింపు

6న బడిబయట పిల్లల గుర్తింపు

8 నుంచి 10వ తేదీవరకు ఇంటింటి ప్రచారం

11న పాఠశాలల్లో చేరని పిల్లల గుర్తింపు

15న సామూహిక అక్షరాభ్యాసం

16న ఎఫ్‌ఎల్‌ఎన్‌ డే

17న బాలికల విద్యపై అవగాహన

18న డిజిటల్‌ తరగతి గదులపై అవగాహన

19న క్రీడా దినోత్సవం నిర్వహణ

పిల్లలు

చేరాలి..

జగిత్యాల: సర్కారు బడులను బలోపేతం చేయాలని, ఇందుకు విద్యార్థుల పెంపే లక్ష్యంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే దాదాపు 50 శాతం మంది ఉపాధ్యాయులందరూ సెన్సెస్‌లో ఉండటంతో బడిబాట కార్యక్రమం పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇచ్చేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోజు ర్యాలీలతోపాటు, పలు చోట్ల గ్రామసభలు నిర్వహించారు. ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా నాణ్యమైన విద్య, ప్రభుత్వం కల్పిస్తున్న ఆధునిక సదుపాయాలపై అవగాహన కల్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఒకవైపు సెలవులు కావడంతో విద్యార్థులంతా వివిధ ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఉపాధ్యాయులు సెన్సెస్‌లో ఉండటంతో బడీడు పిల్లలను చేర్చేందుకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు సాధించిన ప్రగతి, ప్రభుత్వ కల్పించిన సదుపాయాలు, మధ్యాహ్న భోజనం, అమ్మ ఆదర్శ కమిటీల భాగస్వామ్యంతో చేపడుతున్న పనులను విద్యార్థులకు వివరిస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు వంతులవారీగా వెళ్తూ బడిబాట కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిసింది. జిల్లాలో 738 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 189 ఉన్నత, 82 ప్రాథమికోన్నత, 467 ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం 35,526 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది.

మెరుగైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని చెప్పవచ్చు. పాఠశాలల్లో సుందరీకరణ, నైపుణ్యం గల ఉపాధ్యాయుల బోధన, డిజిటల్‌ బోధన, మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు ఇలా అన్ని పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే నూతనంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేశారు.

చేపట్టాల్సిన కార్యక్రమాలివే...

ఈనెల 19 వరకు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలతో కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ఇంటింటికీ పంపిణీ చేస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అర్హత గల పిల్లలను ప్రీప్రైమరీ తరగతుల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటారు. బడిబాట కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండేలా చూస్తున్నారు. 5 నుంచి 14 ఏళ్ల బడిబయట పిల్లలను గుర్తించి ఉపాధ్యాయులు జాబితా రూపొందించాలి. వారిని పాఠశాలల్లో అడ్మిషన్‌ చేయించాలి. గ్రామ విద్య రిజిష్టర్‌ అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు పాఠశాల విద్యపై ఆసక్తి కలిగేలా కార్యక్రమం నిర్వహించాలి. మహిళా సంఘాల సహకారంతో బడీడు పిల్లలను గుర్తించి చేర్పించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే దివ్యాంగ పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించాలి.

అమలైతే హ్యాపీ

బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ ఈసారి సంఖ్య పెరిగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఉపాధ్యాయులందరూ సెన్సెస్‌లో ఉండటంతో గ్రామగ్రామాన తిరుగుతూ బడీడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేది సాధ్యమవుతుందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ విద్యాశాఖ అనుకున్నట్లు విద్యార్థులు భారీగా చేరితో ప్రభుత్వం లక్ష్యం కొంతమేర ఫలించినట్లు లెక్క.

ప్రారంభమైన బడిబాట కార్యక్రమం

సర్కారు పాఠశాలల బలోపేతమే లక్ష్యం.

ఉదయం 7గంటల నుంచి 9 వరకు ప్రచారం

ఆచరణలో పెడితేనే అందరికి ఆమోదం

సగం మంది ఉపాధ్యాయులు సెన్సెస్‌లో

జిల్లాలో బడిబాట కార్యక్రమాలు ఇలా..

Advertisement
 
Advertisement
Advertisement