మక్కల పైసలు ఇంకెప్పుడో..! | - | Sakshi
Sakshi News home page

మక్కల పైసలు ఇంకెప్పుడో..!

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

జగిత్యాలఅగ్రికల్చర్‌: మక్కలు అమ్మిన రైతులకు డబ్బులు ఇంకా ఖాతాల్లో చేరడం లేదు. విత్తనాల, ఎరువుల కొనుగోలుకు చేతిలో డబ్బులు లేక అన్నదాతలు దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గురువారం వరకు రూ.109 కోట్ల మక్కలు కొనగా.. కేవలం రూ.10 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమ చేశారు. మిగతా రైతులు డబ్బుల కోసం ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి ఖాతాలు చెక్‌ చేయించుకుంటున్నారు. మొన్నటి వరకు మక్కలు కొనాలని పోరాటాలు చేసిన రైతులు.. ఇప్పుడు డబ్బులు చెల్లించాలని పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

4.55 లక్షల క్వింటాళ్ల కొనుగోలు

యాసంగి సీజన్‌లో మార్క్‌ఫెడ్‌ సంస్థ జిల్లాలో 12 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 11,773 మంది రైతుల నుంచి 4.55 లక్షల క్వింటాళ్లను రూ.2400 ధరతో కొనుగోలు చేసింది. ఈ లెక్కన రైతులకు దాదాపు రూ.109.34 కోట్లు చెల్లించాల్సి ఉంది. 8 కేంద్రాలను ఇప్పటికే మూసివేశారు. మరో 4 కేంద్రాల నుంచి మరో 15 వేల క్వింటాళ్ల మక్కలు రానున్నాయి. ఇటీవల వర్షాలు పడి కొనుగోలు కేంద్రాల్లో మక్కలు తడిసిపోతే.. నానా తిప్పలు పడి పంటను అమ్మారు. విక్రయించి నెల రోజులు అయినా ఇప్పుడు డబ్బులు చెల్లించడం లేదు.

దిక్కులు చూస్తున్న రైతులు

జిల్లాలో ఎక్కువగా ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, జగిత్యాల, రాయికల్‌ మండల రైతులు మార్క్‌ఫెడ్‌కు మక్కలు విక్రయించారు. మద్దతు ధరకు విక్రయించామని సంబరపడాలో.. లేక డబ్బులు ఇంకా రాలేవని బాధపడాలో అర్థంకాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు.

కేంద్రం కొన్నది రావాల్సిన పైసల్‌ (క్వింటాళ్లలో) (రూ.కోట్లలో)

ధర్మపురి 26,663 6.39

గొల్లపల్లి 38,370 9.20

ఇబ్రహీంపట్నం 59,541 14.28

కోరుట్ల 36,819 8.83

మెట్‌పల్లి 60,819 14.59

జగిత్యాల 51,629 12.39

లక్ష్మీపూర్‌ 27,493 6.59

రాయికల్‌ 63,856 15.32

బీర్‌పూర్‌ 14,375 3.45

కథలాపూర్‌ 17,779 4.26

మల్లాపూర్‌ 32,982 7.91

మేడిపల్లి 25,256 6.06

రైతులకు రావాల్సిన డబ్బులు రూ.100 కోట్ల పైనే..

12 కేంద్రాల ద్వారా 4.55 లక్షల క్వింటాళ్ల కొనుగోలు

రెండు నెలలుగా ఎదురుచూస్తున్న అన్నదాతలు

Advertisement
 
Advertisement
Advertisement