సాక్షి పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించింది. వివిధ కారణాలతో అప్పుడు పదుల సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. వాటిని రద్దు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రద్దుచేసిన వాటిని మిగతా పేదలకు కేటాయించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికితోడు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రతీ నియోజకవర్గానికి మరోరెండు వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయించింది.
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి సన్నద్ధం
అర్హులైన లబ్ధిదారుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటినుంచి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం మొదలైన స్వల్పవ్యవధిలోనే నిధులు మంజూరై, గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం. దీనికితోడు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్‌బెడ్రూమ్ ఇళ్లను సైతం పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్రూమ్ ఇళ్లను పూర్తిచేసి, విద్యుత్, మంచినీటి, డ్రైనేజీ, రోడ్లు వంటి వసతులు కల్పించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేటాయించిన వాటిల్లో అనర్హులు ఉంటే తొలగించి, అర్హులకు కేటాయించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అనేకఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల ఫలించనుంది.
పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు
రెండోవిడతలో 2 వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు
శరవేగంగా సాగుతున్న ‘ఇందిరమ్మ’ నిర్మాణాలు
జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల గృహ ప్రవేశాలు


