కోరుట్ల: మండుతున్న ఎండలకు భూగర్భజలాలు రోజురోజుకూ ఇంకిపోతుడటంతో కోరుట్ల పట్టణంలోని సగం వార్డుల్లో తాగునీటికి జనం తిప్పలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరిగా సరఫరా కాకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారింది. మరికొన్ని రోజులు వర్షం కురవకుంటే తాగునీటి ఎద్దడి అన్ని ప్రాంతాలకు విస్తరించి జనం మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎండలు తగ్గితేనే..
15 రోజులుగా వేసవి తీవ్రత పెరిగిపోతోంది. వారంరోజులుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో బోర్లు, బావులతోపాటు తాగునీటి వనరుల్లో నీరు ఇంకిపోతోంది. కోరుట్ల పట్టణానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న తాళ్ల చెరువులోనూ నీటిమట్టం తగ్గిపోయింది. డబ్బా గ్రామం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరాలోనూ లెక్కలేని ఆటంకాలు చోటు చేసుకుంటున్నాయి. నీటి సరఫరా పైప్‌లైన్‌లు చాలా చోట్ల లీక్ కావడం, పగిలిపోవడం వంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కోరుట్ల పట్టణంలోని కొన్ని వార్డుల్లో భగీరథ పైప్‌లైన్ లేకపోవడం నీటి సమస్యకు కారణమవుతోంది. ప్రస్తుతం పట్టణంలోని భీమునిదుబ్బ, నక్కలగుట్ట, బాగ్యనగర్, ప్రకాశం రోడ్, హాజిపురా ఏరియాల్లో చాలాచోట్ల బోర్లు ఇంకిపోయి నీటికోసం జనం ఇబ్బంది పడుతున్నారు.
మూడు ట్యాంకర్లతో సరఫరా
పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు మూడు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా.. అవి ఎటూ సరిపోవడం లేదు. 10 వార్డుల్లో నీటి సమస్య తీవ్రం కాగా.. మూడు ట్యాంకర్లతో నీటి సరఫరా వీలు కావడం లేదు. ఫలితంగా రోజుకు కొన్ని వార్డుల చొప్పున నీరు అందించాల్సి వస్తోంది. అదనపు ట్యాంకర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముండగా ఈ విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఇబ్బందిగా మారింది.
కోరుట్లలో నీటి కటకట
సగం వార్డుల్లో తిప్పలే..
ట్యాంకర్లతో సరఫరా


