తేలు బుద్ధి | - | Sakshi
Sakshi News home page

తేలు బుద్ధి

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

తేలు బుద్ధి

అడవిలో ఒకతేలు

ఆకలితో పడుకున్నది

కదలలేక మెదలలేక

కన్నీరును ఒలుకుతుండే

అది చూసిన ఓ కోడి

ఆహారం దొరికిందని

పరుగు పరుగున అచటి కొచ్చి

ముక్కుతోని పొడవ చూసే

ప్రాణ భయంతో తేలు

కోడి బావ కోడి బావ

ఒక్కమాట చెబుతాను

ఆలకించుమని కోరే

నాకు ఆరోగ్యం బాగులేదు

ఆహారం అసలు దొరకలేదు

నాతో స్నేహంగా ఉండి చూడు

హాని చేయబోను ఎవరికెపుడు

తేలు మాట నమ్మి కోడి

తన ఇంటికి తీసుకెళ్లి

ఆహారం తెచ్చి ఇచ్చి

ఆతిథ్యం మంచి గిచ్చి

చెలిమి తోడ వుండమంటూ

సలహాలను మెండు గిచ్చే

తనకు దోస్తు దొరికాడని

సంబరపడి పోయే కోడి

పొద్దు పొద్దు గాలనే

కొక్కోర కో అంటూ లేచి

తన పిల్లలను చూడ మంటూ

బయటకు పోయే తల్లి కోడి

బలం పుంజుకున్న తేలు

కపట బుద్ధి దాచుకుంటూ

కత్తెర చేతులు చాచి

కస్సు బుస్సుమని లేచే

అమ్మదోస్తు ఈ తేలని ప్రేమగ

దరి చేరినాయి పిల్ల కోళ్లు

తన తోక కొండి లేపి మరీ

చిటుకు చిటుకున కుట్టే తేలు

లబో దిబోమంటూ

బుజ్జి బుజ్జి పిల్ల కోళ్లు

తల్లి చెంతకు పరుగు తీసి

బోరుమంటూ ఏడ్వసాగే

తేలు బుద్ధి తెలుసుకున్న

తల్లికోడి కోపంతో

రయ్యిన ఉరుకురికి వచ్చి

తెలుపైన ఎగిరి దూకే

తన ముక్కుతో తేలును

ముక్కలు ముక్కలుగ చీల్చి

స్నేహ ద్రోహి దేహాన్ని

కసితీరా ఆరగించే...

ఎప్పుడైనా ఈ జగాన

బుద్ధిలేని ప్రబుద్ధులతో

జాగ్రత్తగా మెదలమంటూ

తల్లికోడి హితము చెప్పే..!

డా.కటుకోఝ్వల రమేశ్‌

కవి, రచయిత ఖమ్మం జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement