ధర్మపురి: మనస్తాపానికి గురై ఓ యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నేరెళ్లలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులిసె గంగారాం, విమల దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు నరేష్ (32) బుధవారం ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లి విమల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. గురువారం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పుల బాధతో వ్యక్తి..
రాయికల్: పట్టణంలోని ధనరేకుల రాజేశ్ (37) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. రాజేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. అప్పు చెల్లించలేని పరిస్థితి ఉండటంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశ్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. లత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


