బాలల కథ : అక్షర సేద్యం | - | Sakshi
Sakshi News home page

బాలల కథ : అక్షర సేద్యం

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

బాలల కథ : అక్షర సేద్యం

రామాపురంలో సోమయ్య అనే మధ్య తరగతి రైతు ఉన్నాడు. అతని కుమారుడు రాజు అదే ఊరిలో ఏడోతరగతి చదువుచున్నాడు. రాజుకు చదువు అంటే చాలా ఇష్టం. శ్రద్ధగా చదువుకుని, ఏదైనా ఉద్యోగం సాధించాలని ఆశ. సోమయ్య కు మూడు ఎకరాల పొలం ఉంది. రాజుని తనతో పాటు పొలం పనులకు తీసుకెళ్లి, ఇద్దరం పనిచేస్తూ మరో మూడు ఎకరాల పొలం కొనుగోలు చేసి ఊరిలో మంచి రైతు గా పేరు సంపాదించి, పెద్ద ఇల్లు నిర్మించుకోవాలని సోమయ్య ఆలోచన. చదువుపై ఉన్న మమకారంతో రాజు పొలం పనులు చేయడానికి ఇష్టపడలేదు. అతన్ని ఎలాగైనా చదువు మాన్పించాలని సోమయ్య ప్రయత్నాలు చేసాడు. చదువుకోవాలనే పట్టుదలను రాజు వదిలిపెట్టలేదు.సోమయ్య కూడా పంతం వీడలేదు. తోటి విద్యార్థులు బడికి వెళ్తుంటే రాజు మనసు గాయపడింది.అమ్మానాన్నలను ఒప్పించడానికి అన్నాహారాలు మాని నిరాహారదీక్ష చేసాడు . తల్లి దండ్రుల మనసు కరిగింది కాని ఒక షరతు పెట్టారు. శ్రీప్రతి రోజూ ఉదయం రెండు గంటలు పొలం పనులు చేయాలి. సాయంత్రం ఇంటి పనులు చేయాలి.సెలవు రోజుల్లో సేద్యపు పనులు చేయాలిశ్రీ. ఇదే మంచి అవకాశమనుకుని రాజు పొలం పనులు చేసుకుంటూ, కష్ట పడి చదవడం మొదలెట్టాడు.పరీక్షల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా,చదువు పై ఉన్న మక్కువతో సంతోషంగా స్వీకరించాడు. తన తోటి పిల్లలు సెలవు రోజుల్లో సరదా ఆటలు ఆడుతున్నా,తను బాధపడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించాడు.

నీతి: సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే..

– దుర్గమ్‌ భైతి

రామునిపట్ల,

సిద్దిపేట జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement