జగిత్యాల: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అందరూ హాజరుకావాలని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు అమరవీరుల స్తూపం, అమరవీరుల పార్క్ వద్ద నివాళులర్పించడం జరుగుతుందని, 8 గంటలకు కలెక్టరేట్‌లో ముఖ్య అతిథితో పతాకావిష్కరణ, గీతాలాపన, పోలీసులతో వందన సమర్పణ ఉంటుందన్నారు. 8.05 గంటలకు సభ వేదిక వద్దకు ముఖ్య అతిథి వచ్చిన అనంతరం 8.10 వరకు పోలీసు మార్చింగ్, 8.10 నుంచి 8.20 వరకు ముఖ్య అతిథి సందేశం, 8.25కు వందన సమర్పణతో ముగుస్తుందని వివరించారు.
ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలి
జగిత్యాలక్రైం: ప్రజా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 16 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
అసోసియేట్ డీన్‌గా సురేశ్
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్‌గా డాక్టర్ జె.సురేశ్ నియమితులు కాగా, సోమవారం కళాశాలలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డాక్టర్ సురేశ్ సిరిసిల్ల వ్యవసాయ కళాశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్లు, నాన్‌టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


