జగిత్యాల: నాన్ స్టాప్‌గా కీబోర్డు వాయించి ప్రతిక్ మక్క గిన్నిస్ బుక్ రికార్డులో చోటు సాధించాడు. జగిత్యాలకు చెందిన మక్క ప్రవీణ్–సుచరిత దంపతుల కుమారుడు ప్రతిక్. చిన్నప్పటి నుంచే కీబోర్డుపై మక్కువ పెంచుకుని పట్టు సాధించాడు. మే 31న హైదరాబాద్‌లోని విక్టరి ఆడిటోరియంలో గిన్నిస్ బుక్ ప్రతినిధుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు వాయిద్యకారులు గంటపాటు వాయిస్తూ పాల్గొన్నారు. ఇందులో కీబోర్డు వాయించడంలో ప్రతిభచూపిన 777 మంది ఎంపిక కాగా, విశేష ప్రతిభ కనబర్చిన ప్రతిక్‌కు గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. గతంలో సైతం ప్రతిక్ చోటు సాధించగా, మరోసారి రికార్డు సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
సరస్వతీ పుత్రులకు లక్ష్మీ కటాక్షం
రాయికల్(జగిత్యాల): ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పేద విద్యార్థులు మండలంలోని భూపతిపూర్‌కు చెందిన న్యాతగిరి సంజన, రాజ్‌దీపక్‌కు దాతలు ఆపన్నహస్తం అందించారు. సోమవారం ‘సాక్షి’లో ‘సరస్వతీ పుత్రులకు లేని లక్ష్మీకటాక్షం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. జగిత్యాల పట్టణానికి చెందిన డాక్టర్ మైత్రిరెడ్డి రూ.5 వేలు, సామాజిక సేవకురాలు బోనాల సునీత రూ.5 వేలు, యాచమనేని రాజశేఖర్‌రావు రూ.10 వేలు, 2012–13 పదో తరగతి విద్యార్థులు రూ.5 వేలు, కుమ్మరిపల్లికి చెందిన జూనియర్ లెక్చరర్ సిరిపురం మహేశ్ రూ.3 వేలు, మరికొంత మంది గ్రామస్తులు స్పందించి సుమారు రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందించారు. అలాగే జగిత్యాలలోని హోప్ స్వచ్ఛంద సంస్థ ఈ విద్యార్థుల చదువుకు సహకారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.


