ఎరువు.. ధర బరువు | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. ధర బరువు

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

అమాంతం పెరిగిన రసాయన ఎరువులు ఒక్కో బస్తాపై కనీసం రూ.300 పెరుగుదల జిల్లా రైతులపై ఏకంగా రూ.ఏడు కోట్ల భారం

జగిత్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సీజన్‌కు ముందుగానే రసాయన ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితులకు తోడు అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరగడంతో.. ఆ భారాన్ని ఎరువుల కంపెనీలు రైతులపై మోపాయి. కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా కనీసం రూ.300కు పైగా పెరిగింది. దీనికితోడు స్టాక్‌ లేదంటూ వ్యాపారులు మరో రూ.50 నుంచి రూ.100 వరకు ఎక్కువ పెంచి విక్రయించే అవకాశం ఉంది. పెరిగిన ధరలతో వానాకాలం సీజన్‌లో అవసరమయ్యే ఒక్క కాంప్లెక్స్‌ ఎరువులకే జిల్లా రైతులపై అదనంగా రూ.6కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

డీఏపీ, యూరియాకే రాయితీ

ప్రస్తుతం కంపెనీలు ధరలు పెంచిన ఎరువుల్లో డీఏపీ, యూరియా లేవు. కేంద్ర ప్రభుత్వం డీఏపీ, యూరియా తయారు చేసే కంపెనీలకు రాయితీ అందిస్తుంది. ప్రస్తుతం డీఏపీ బస్తా ధర రూ.1356, యూరియా రూ.260గా ఉంది. వీటిని కొనుగోలు చేయాలంటే, కంపెనీలు, దుకాణదారులు ఇతర ఎరువులను కొనాలని లింక్‌ పెడుతున్నాయి. ఫలితంగా అవసరం లేకున్నా.. ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. మరోవైపు కాంప్లెక్స్‌ ఎరువులు ధరలు పెరగడంతో రైతులు తమ పంట అవసరాలకు కాంప్లెక్స్‌కు బదులు తక్కువ ధరకు దొరికే యూరియాను అధికంగా వినియోగించే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు.

జిల్లాకు ఎరువుల అవసరం ఇలా..

వానాకాలం సీజన్‌కు 88,732టన్నుల ఎరువులు అవసరం. ఇందులో ప్రస్తుతం 13,310 టన్నుల ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా ఎరువులను అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానాకాలం సీజన్‌లో 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ, 26,632 టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 10,653 టన్నుల కాంప్లెక్స్‌, 3,329 టన్నుల సింగిల్‌ సూపర్‌ పాస్ఫేట్‌ అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.

పెరిగిన రసాయన ఎరువుల ధరలు (రూ.లలో)

ఎరువు పాత ధర కొత్త ధర తేడా

14–35–14 1900 2350 450

24–24–0 2000 2300 300

10–26–26 1950 2250 300

20–20–0–13 1800 2150 350

16–16–16 1675 2050 375

15–15–15–0–9 1650 195 300

16–20–0–13 1400 1750 350

ఎన్‌ఓపి 1850 1975 125

ఎస్‌ఎపీ 615 775 160

(ఈ ధరలకు అదనంగా రవాణా చార్జీలు, గోదాముల ఖర్చులు అంటూ స్థానిక వ్యాపారులు మరింతగా వసూలు చేసే అవకాశం ఉంది)

Advertisement
 
Advertisement
Advertisement