పంట అవశేషాలు తగలబెడితే జరిమానా | - | Sakshi
Sakshi News home page

పంట అవశేషాలు తగలబెడితే జరిమానా

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

● మెట్‌పల్లి మండలం కొండ్రికర్లలో పంచాయతీ సిబ్బంది నిర్వాకం ● ఒక్కొక్కరి నుంచి రూ.200 వసూలు ● గ్రామంలోని మైక్‌లో చెప్పించిన వైనం

జగిత్యాలఅగ్రికల్చర్‌: పంట అవశేషాలు తగలబెడితే జరిమానా విధిస్తామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. కొయ్యకాళ్లను కాల్చడం ద్వారా మంటలు అదుపు తప్పి సమీపంలోని ఆయిల్‌ పాం, మామిడి తోటలు కాలిపోతున్నాయని, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు, స్తంభాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ప్రజల ఆస్తుల రక్షణ దృష్ట్యా రైతులు పంట అవశేషాలను కాల్చకుండా ప్రత్యామ్నయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధిస్తామన్నారు.

బాధితుని వైద్య ఖర్చులకు రూ.1.27 లక్షల సాయం

ధర్మపురి: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ నిరుపేదకు సాయం అందించాలని చేసిన ఫేస్‌బుక్‌ పోస్టుకు స్పందించిన ఎన్నారైలు రూ.1.27లక్షలు విరాళాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. సారంగపూర్‌ మండలం పెంబట్లకు చెందిన ఎలిగేటి శ్రీధర్‌, హరిత దంపతులకు కుమారుడు సంతానం. శ్రీధర్‌ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. మూడేళ్ల క్రితం శ్రీధర్‌కు రెండు కిడ్నీలు చెడిపోగా.. భార్య కిడ్ని అమర్చారు. కొన్నినెలల క్రితం శ్రీధర్‌ గుండెజబ్బు బారిన పడ్డాడు. వైద్యులు స్టంట్‌ వేయాలని సూచించారు. రెండునెలల క్రితం పక్షవాతం బారిన పడి మంచానికే పరిమితమయ్యాడు. అప్పటినుంచి హరిత బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. వైద్య ఖర్చులకు ఆ కుటుంబం తీవ్ర ఇబ్బంది పడుతుండగా.. సమస్య తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్‌ మే 3వ తేదీన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి సాయం కోరాడు. అందుకు స్పందించిన ఎన్నారైలు, ఇతర దాతలు స్పందించి హరిత బ్యాంకు ఖాతాకు రూ.1.27లక్షలు విరాళంగా అందించారు. రమేశ్‌ వాటిని స్థానిక తహసీల్దార్‌ శ్రీనివాస్‌, యూనియన్‌ బ్యాంకు మేనేజర్‌ మాధవరావు చేతులమీదుగా బాధితుడి భార్యకు పంపిణీ చేయించాడు.

చేయూత పెన్షన్ల మార్పిడికి డబ్బులు వసూలు

మెట్‌పల్లిరూరల్‌: చేయూత పెన్షన్ల మార్పిడికి పంచాయతీ సిబ్బంది డబ్బులు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మెట్‌పల్లి మండలం కొండ్రికర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెన్షన్ల పంపిణీ విధానాన్ని పూర్తిగా మార్చి.. నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పెన్షన్‌దారుల నుంచి ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా, పెన్షన్‌ ఐడీ వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ ఎలాంటి అక్రమాలకూ తావులేకుండా చేపట్టాలి. కానీ కొండ్రికర్లలో మాత్రం ఒక్కొ పెన్షన్‌దారు నుంచి పంచాయతీ సిబ్బంది రూ.200 వసూలు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయాన్ని మైక్‌లో చెప్పించడం గమనార్హం. గ్రామంలో దాదాపుగా 400కి పైగా పెన్షన్లు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా పెన్షన్‌దారులు కావాల్సిన ధృవీకరణ పత్రాలు సమర్పించారు. మార్పిడి విధానానికి ఇతర గ్రామాల్లో ఎక్కడా డబ్బులు వసూలు చేయడంలేదని తెలుసుకున్న గ్రామస్థులు డబ్బులు వసూలు చేసిన వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజును ‘సాక్షి’వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement