రోజురోజుకూ పెరుగుతున్న కూరగాయల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లు మండుతున్న ఎండలతో తగ్గిన దిగ్గుబడి
జగిత్యాలఅగ్రికల్చర్: ఓ వైపు ఎండలు.. మరోవైపు కూరగాయల ధరలు మండుతున్నాయి. ఇప్పటివరకు రూ.100 పట్టుకుని మార్కెట్‌కు వెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు ఒక్కటి, రెండు రకాలు కూడా రావడం లేదు. టమాట, ఆలు, గోరుచిక్కుడు, అలిసంత, మిర్చి, వంకాయ, బెండ వంటివే మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. మార్కెట్‌కు అన్ని రకాలు రాకపోవడానికి వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎండలకు రాలిన పూత
చాలామంది రైతులు వేసవి పంటగా టమాట, బీర సాగు చేస్తారు. పూత సమయంలో ఎండలు మండిపోవడంతో ఈ ఏడాది పూత మొత్తం రాలిపోయింది. ఫలితంగా దిగుబడి గణనీయంగా పడిపోయింది. పంట మొదటి దశలో అకాల వర్షాలు కురవడంతో ఎదుగుదల లోపించింది. దీంతో కూరగాయల విస్తీర్ణం పడిపోయింది. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి పరిసర ప్రాంతాల రైతులు కూరగాయలు సాగు చేస్తారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వారంతా సాగుకు దూరమయ్యారు. మార్కెట్‌కు బీర, సోర, కాకర, దొండ, బెండ వంటివి మాత్రమే వస్తున్నాయి. వ్యాపారులు మెదక్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండడంతో రవాణా చార్జీలు పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం మిర్చి కిలో రూ.70, టమాట రూ.50, సోర (ఒకటి) రూ.30, గోరుచిక్కుడు రూ.50, వంకాయ రూ.50, కొత్తిమీర రూ.100, చిక్కుడు రూ.60 చొప్పున పలుకుతున్నాయి. హోల్‌సేల్ వ్యాపారులు కొంత తగ్గించి ఇస్తున్నా.. రిటైల్ వ్యాపారులు రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. కిలో రూ.50 నుంచి రూ.100 పెట్టలేక ప్రజలు రూ.10నుంచి రూ.20కి వచ్చే పాలకూర, పచ్చకూర, గొంగూర వంటి కూరగాయలే చివరకు దిక్కవుతున్నాయి. పెరిగిన కూరగాయల ధరలు సామాన్య వినియోగదారులకు పెను భారంగా మారుతున్నాయి. ప్రధానంగా రైతులు వానాకాలం సీజన్‌కు సమాయత్తం అవుతుండటంతో చివరి దశకు చేరిన తోటలను దున్నించి వానాకాలం పంటలకు సిద్ధం చేస్తున్నారు.


