● ప్రతీ పాఠశాలలో బాలల రక్షణ అధికారి ● జిల్లాలో 220 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు | - | Sakshi
Sakshi News home page

● ప్రతీ పాఠశాలలో బాలల రక్షణ అధికారి ● జిల్లాలో 220 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

● ప్రతీ పాఠశాలలో బాలల రక్షణ అధికారి ● జిల్లాలో 220 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు

కథలాపూర్‌(వేములవాడ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవ్‌టీజింగ్‌, వేధింపులు, బాల్య వివాహాలను అరికట్టడానికి ఉన్నత పాఠశాలల్లో నూతన వ్యవస్థ రూపుదిద్దుకోనుంది. ప్రతీ ఉన్నత పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలిని బాలల రక్షణ అధికారి(చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌)గా నియమిస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర చట్టపరమైన సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ కొత్త రక్షణ వ్యవస్థను అమల్లోకి తేనున్నారు. వచ్చే నెల 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో అప్పటినుంచే ఈ విధానం అమల్లోకి రానున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.

జిల్లాలో 220 ఉన్నత పాఠశాలలు

జిల్లాలో ఐదు మున్సిపాలిటీలతోపాటు 385 గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో 189 జెడ్పీ హైస్కూళ్లు, 13 మోడల్‌ స్కూళ్లు, 16 కేజీబీవీలు, రెండు గురుకులాలున్నాయి. ఉన్నత పాఠశాలల్లో బోధించే ఒక ఉపాధ్యాయురాలిని బాలల రక్షణ అధికారిగా నియమించనున్నారు. ఉపాధ్యాయురాలు కేవలం బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల రక్షణ బాధ్యత కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, బాల కార్మిక వ్యవస్థల నుంచి బాలలను రక్షించటమే దీని లక్ష్యం. వేధింపులకు గురయ్యే విద్యార్థినులు తమ సమస్యను నేరుగా సీపీవోకు తెలియజేసే అవకాశం ఉంటుంది. బాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతూనే వారికి అవసరమైన రక్షణ, న్యాయ సాయం అందించనున్నారు.

చట్టాలపై ప్రత్యేక తరగతులు

విద్యార్థులకు అవగాహన పెంచటానికి ప్రతీ వారం ఒక పీరియడ్‌ చట్టాలపై వివరించనున్నారు. లీగల్‌, లిటరసీ, చైల్డ్‌ రైట్స్‌ క్లబ్‌ను ఏర్పాటు చేసి సెమినార్లు, పోటీలు నిర్వహిస్తారు. కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయటానికి జిల్లాస్థాయిలో డీఈవో, మండలస్థాయిలో ఎంఈవోలు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. దీనిపై మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహిస్తారు. కార్యక్రమం నిర్వహణకు అందుబాటులో ఉన్న వనరులతోపాటు సీఎస్‌ఆర్‌ నిధులను ఉపయోగించుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే నేరుగా చెప్పుకునేలా ప్రతీ పాఠశాలకు ఒక బాలల రక్షణ అధికారిని నియమించాం. ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల ప్రవర్తన, భద్రతపై ప్రత్యేకంగా చొరవ చూపాలి. అప్పుడే విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడినవారమవుతాం.

– నీరజ, జీసీడీవో

బడుల్లో ‘అభయం’

Advertisement
 
Advertisement
Advertisement