‘వానాకాలం’ రూ.1,693 కోట్లు
జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్ పంటల రుణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. వ్యవసాయాధారిత జిల్లా కావడంతో గతేడాది కన్నా అదనంగా రూ.153 కోట్ల రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు, ప్రసుత్త సీజన్‌లో ౖరైతులకు రూ.1,693 కోట్ల రుణాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లాలోని 35 బ్యాంకు శాఖల ద్వారా రుణాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాలోని బ్యాంకులు 10 శాతం మేర పంట రుణాలు ఇవ్వగా, మిగతా రైతులు పాతవి చెల్లించి, కొత్తగా రుణాలు తీసుకుంటున్నారు.
లక్ష్యం మేరకు రుణాలు
జిల్లాలో గ్రామీణ, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కలిపి దాదాపు 130 శాఖలున్నాయి. అన్ని బ్యాంకులు పంట రుణాలు ఇచ్చేలా కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు లీడ్ బ్యాంకు మేనేజర్ రాంకుమార్ లక్ష్యాలను నిర్దేశించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో 1,43,793 మంది రైతులకు రూ.2,821.52 కోట్ల రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వానాకాలం సీజన్‌లో 86,284 మంది రైతులకు రూ1,693 కోట్లు, యాసంగిలో 57,509 మంది రైతులకు రూ.1,128.61కోట్లు అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యం నిర్దేశించుకుంది.
35 బ్యాంకుల ద్వారా..
జిల్లాలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉండగా, వానాకాలం సీజన్‌లో వాటి పరిధిలోని 53,258 మంది రైతులకు రూ.1,153.06 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. 21 ప్రైవేట్ బ్యాంకుల ద్వారా 2,238 మందికి రూ.122.85 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా 14,442 మంది రైతులకు రూ.210.91 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా 16,346 మందికి రూ.206.10 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రైవేట్ బ్యాంకులు అంతంతే..
రైతులకు రుణాలు ఇవ్వడంలో ప్రైవేట్ బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1,153.06 కోట్ల రుణాలు ఇస్తే, ప్రైవేట్ బ్యాంకులు 21 వరకు ఉండగా, కేవలం 9 బ్యాంకులు రూ.122.85 కోట్ల రుణాలు మాత్రమే ఇస్తున్నాయి. ప్రైవేట్‌బ్యాంకుల్లో హెచ్‌డీఎఫ్‌సీ రూ. 14.49 కోట్లు, ఐసీఐసీఐ రూ.52.70 కోట్లు, సిటీ యూనియన్ బ్యాంకు రూ.17.98 కోట్లు ఇస్తుండగా, మిగతా బ్యాంకులు రూ.5–10 కోట్ల లోపునకే పరిమితమైనాయి. రైతులు ఏ బ్యాంకుకు వెళ్లినా పంట రుణాలు ఇవ్వాలని ఉన్నా, ప్రైవేట్ బ్యాంకులు లేనిపోని సాకులు చెప్పి తప్పించుకుంటున్నాయి.
రుణాల పంపిణీ ప్రారంభం
అన్ని బ్యాంకుల్లో పంట రుణాల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే కొందరు పాతవి చెల్లించి, కొత్త రుణం తీసుకుంటున్నారు. వ్యవసాయ భూమి ఉన్న ప్రతీ రైతుకు పంట రుణం ఇస్తాం. రైతు పేరిట పట్టాదారు పాస్‌బుక్‌లో వ్యవసాయ భూమి ఏ మేరకు ఉంటే, ఆ మేరకు రుణం ఇస్తున్నాం. రుణాల విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే తమ దృష్టికి తీసుకవస్తే సమస్య పరిష్కరిస్తాం. – రాంకుమార్,
లీడ్ బ్యాంక్ మేనేజర్, జగిత్యాల


