ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిఽ దిలో శుక్రవా రం స్వామి వారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో అర్చకుడు శ్రీనివాసచార్యులు లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు.
టీజీ ఈసెట్‌లో 112వ ర్యాంక్
మల్లాపూర్(కోరుట్ల): మండలకేంద్రానికి చెందిన న్యావనంది నవీన్ శుక్రవారం విడుదలైన పీజీ ఈసెట్ (టీజీఈసీఈటీ–2026) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 112వ ర్యాంక్ సాధించాడు. పాలిటెక్నిక్(డిప్లొమా), బీఎస్సీ(మాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు లెటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ప్రవేశపరీక్షలో నవీన్ ప్రతిభ చాటాడు.
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సుమారు 200 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అశోక్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కౌన్సెలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రక్రియ జూన్ 1 వరకు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు తమ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా కోర్సులను ఎంపిక చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ జీవీఆర్, సాయిమధుకర్ పాల్గొన్నారు.
డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
ధర్మపురి: మాదకద్రవ్యాల నిర్మూలనకు ధర్మపురి పట్టణంలోని వివిధ ప్రాంతాల్ల్లో శుక్రవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేశ్, సిబ్బంది డాగ్‌స్క్వా సాయంతో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల కోసం కిరాణా దుకాణాలు, హోటళ్లు, పాన్‌షాపుల్లో తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాలు వినియోగిస్తే కలిగే అనర్థాలపై యువతకు సీఐ అవగాహన కల్పించారు. వాటిని వినియోగిస్తున్న వారి సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు.


