139 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ | - | Sakshi
Sakshi News home page

139 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ

May 29 2026 2:19 AM | Updated on May 29 2026 2:19 AM

కథలాపూర్‌: గ్రామ పంచాయతీ కార్యదర్శుల సాధారణ బదిలీల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో 385 గ్రామపంచాయతీలుండగా.. 288 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నవారికి బదిలీ అవకాశం ఇచ్చారు. సీనియార్టీ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందులో 139 మంది పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు. వీరందరికీ ఈనెల 31న బదిలీ ఉత్తర్వులు అందిస్తామని, వచ్చేనెల ఒకటిన బదిలీ అయిన స్థానంలో విధుల్లో చేరాల్సి ఉంటుందని డీపీవో మదన్‌మోహన్‌ తెలిపారు.

డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు

ప్రిన్సిపాల్‌ రామకృష్ణ

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27లో రెండు అడ్వాన్స్‌డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ రామకృష్ణ తెలిపారు. విద్యార్థినులకు ఉన్నత విద్యతోపాటు, త్వరితగతిన ఉపాధి అవకాశాలు లభించేలా కోర్సులను ప్రవేశపెట్టామన్నారు. బీకాంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, బీఎస్సీ హెల్త్‌కేర్‌లో 60 సీట్లతోపాటు, రూ.7వేల ప్రోత్సాహం అందుతుందన్నారు. విద్యార్థినులు చదువుకుంటూనే సంపాదించుకునే వీలుందన్నారు. వివరాలకు కళాశాల కో–ఆర్డినేటర్‌ చంద్రయ్యను 94913 65275 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

బల్దియాలో అవినీతిపై చర్చకు సిద్ధమా..?

జగిత్యాలటౌన్‌: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్‌ సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి ముఖేష్‌ ఖన్నా ఖండించారు. ఎమ్మెల్యేకు అవినీతి మరక అంటించేలా పదేపదే ఆరోపణలు చేస్తున్న శ్రావణి ఆమె మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేసినప్పుడు జరిగిన అవినీతిపై తహసీల్‌ చౌరస్తా వేదికగా బహిరంగ చర్చకు రావాలని పోస్టర్లు ముంద్రించారు. వాటిని పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అంటించడం చర్చనీయాంశంగా మారింది.

రక్తదానం గొప్పది

ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి

జగిత్యాల: రక్తదానంతో కొందరి ప్రాణాలు నిలబడతాయని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఐఎంఏ హాల్‌లో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఆపదలో రోగులుకు రక్తం కొరత లేకుండా ప్రతిఒక్కరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఐఎంఏ కోశాధికారి సుధీర్‌కుమార్‌ పాల్గొన్నారు.

అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయండి

జగిత్యాల: విద్యాశాఖలో 2026–27లో అక్రమ డిప్యూటేషన్లకు అవకతవకలకు తావు లేకుండా చూడాలని డీఈవో రాముకు యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్‌సుందర్‌, అంబటి భూమేశ్వర్‌ వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిప్యూటేషన్లు ప్రోత్సహించవద్దని, అలాంటి వాటిని వెంటనే రద్దు చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement