బుగ్గారం: గ్రామీణ జీవనానికి ఆధారమైన చెరువులు, కుంటలు కబ్జా కోరల్లో చిక్కుకుని కుచించుకుపోతున్నాయి. బుగ్గారం మండలంలోని పలు గ్రామాల్లో వాటి ఉనికే కోల్పోయే స్థితికి చేరుకున్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ తాగు, సాగునీటికి ప్రధాన వనరులుగా చెరువులు, కుంటలే నిలుస్తున్నాయి. అలాంటి చెరువులు కబ్జాదారుల ఆక్రమణలకు బలవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో వాటి స్వరూపాన్నే కోల్పోతున్నాయి.
అన్ని చెరువులదీ అదే పరిస్థితి
బుగ్గారం మండలంలో పది గ్రామాలున్నాయి. ఇక్కడ మొత్తంగా 24 చెరువులు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. వీటిలో బుగ్గారంలో 4, గంగాపూర్‌లో 3, మద్దునూర్‌లో 3, వెల్గొండలో 3, సిరివంచకోటలో 3, శెకెల్లలో 3, గోపులాపూర్‌లో 2, చిన్నాపూర్, సిరికొండ, యశ్వంతరావుపేటలో ఒకటి చొప్పున ఉన్నాయి. వీటన్నింటి విస్తీర్ణం 772.16 ఎకరాలుగా ఉంది. శెకెల్లలో సర్వే నంబరు 337లోగల చెరువు విస్తీర్ణం 146.16ఎకరాలు. సిరివంచకోటలోని చెరువు 97.39, వెల్గొండలోని బోలి చెరువు 94.38, సిరివంచకోటలోని పల్ల కుంట 79.08 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. అయితే చాలావరకు వీటి విస్తీర్ణం కాగితాలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చెరువులకు సమీపంలో వ్యవసాయ భూములున్న కొందరు వ్యక్తులు క్రమక్రమంగా ఆక్రమించుకోవడంతో వీటి విస్తీర్ణం తగ్గిపోతూ వస్తోంది. చెరువులకు సంబంధించిన సమాచారం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల వద్ద వేర్వేరుగా ఉంది. రెవెన్యూ అధికారుల సమాచారం ప్రకారం మండలంలో 24 చెరువులుండగా.. ఇరిగేషన్ అధికారుల ప్రకారం 29 చెరువులుగా ఉండడం గమనార్హం.
ఫీడింగ్ కాలువలు కనుమరుగు
మండలంలో అటవీ భూములున్నాయి. గుట్టలు, ఎత్తైన ప్రాంతాలూ ఉన్నాయి. వర్షాలు కురిసినప్పుడు వీటి నుంచి వచ్చే ప్రవాహాలతో చెరువులు, కుంటలు వేగంగా నిండుతాయి. ఏళ్ల తరబడి గుట్టల నుంచి వచ్చే నీటి ప్రవాహాలతో సహజసిద్ధంగా కొన్ని కాలువలు ఏర్పడ్డాయి. ఆ కాలువలు ప్రభుత్వ, పట్టా భూముల్లో ఏర్పడినప్పటికీ రైతులు వాటిని ఏనాడూ ధ్వంసం చేయలేదు. ప్రస్తుతం మా రుతున్న పరిస్థితుల దృష్ట్యా భూములకు డిమాండ్ పెరగడం.. యాంత్రీకరణ అందుబాటులోకి రావడంతో వీటి సమీపంలో పొలాలు గల రైతులు, ఇతర వ్యక్తులు వాటిని పూడ్చివేస్తున్నారు. ఫలితంగా చెరువులు నిండడానికి ప్రధానాధారమైన సహజంగా ఏర్పడిన ఫీడింగ్ కాలువలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఇటీవల గంగాపూర్‌లో కొంతమంది వ్యక్తులు తమకు పట్టా ఉందనే కారణంతో స్థానికంగా ఉన్న ఓ కుంటను మొరంతో పూడ్చివేయడానికి పూనుకున్నారు. గ్రామస్తుల ఫిర్యాధు మేరకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు.
గొలుసుకట్టు వ్యవస్థ ధ్వంసం
మండలంలోని ప్రతి చెరువు మరో చెరువుతో అనుసంధానించబడి.. గొలుసుకట్టు వ్యవస్థగా ఏర్పడి ఉంది. ఈ విధానంతో ఒక చెరువు నిండగానే ఎక్కువైన నీటిని మరో చెరువులోకి మళ్లించేలా కాలువలు (ఒర్రెలు) ఉన్నాయి. వీటిలో కొన్ని సహజంగా ఏర్పడగా.. మరికొన్ని ఏళ్ల క్రితమే నిర్మించారు. వీటిలో సహజంగా ఏర్పడిన కాలువలు చాలావరకు ఆక్రమణలతో ఆనవాళ్లు కోల్పోతున్నాయి. మండలంలోని చెరువుల కింద మొత్తం 3,543.49 ఎకరాల వ్యవసాయ భూమి ఆయకట్టుగా ఉంది. చెరువుల్లో పూడిక పేరుకుపోతుండడంతో యాసంగిలో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోవడం సర్వసాధారణంగా మారింది.
క్రమక్రమంగా ఆక్రమణ
కానరాని ఫీడింగ్ కాలువలు
గొలుసుకట్టు వ్యవస్థ ధ్వంసం
స్వరూపం కోల్పోతున్న కుంటలు


