కథలాపూర్: గ్రామాల్లో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ ఆ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు గోదాములు లేకపోవడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. మరోవైపు ధాన్యం సేకరణలో ఆలస్యం అవుతోంది. ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, కొత్తగా ధాన్యం తీసుకోబోమని రైస్‌మిల్లర్లు ప్రతి సీజన్‌లో చెబుతుండడంతో రైతులు ధాన్యం విక్రయించేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్కెటింగ్‌శాఖ తరఫున గోదాములు నిర్మిస్తే వరి, మక్కలతోపాటు ఇతర పంటలు కొనుగోలు చేసి అందులో నిల్వ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా మార్కెటింగ్‌శాఖకు ఆదాయం కూడా సమకూరుతుంది. రైతులకు ఇబ్బందులూ తొలగుతాయని రైతులు అంటున్నారు.
స్థలాలు ఉన్నా.. నిర్మాణాలపై పట్టింపేదీ?
కథలాపూర్ మండలంలో 19 గ్రామాలున్నాయి. కానీ.. ధాన్యం నిల్వ చేసేందుకు ఒక్క గోదాం కూడా లేకపోవడం దారుణమని రైతులు అంటున్నారు. రైతులు విక్రయించిన ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేయడం ద్వారా మార్కెటింగ్ శాఖకు ప్రతి సీజన్‌లో పన్ను రూపంలో డబ్బులు సమకూరే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికి నిర్మాణలపై దృష్టిసారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలకేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కార్యాలయం సమీపంలో గోదాం నిర్మాణానికి అనువైన స్థలం ఉంది. మరోవైపు సబ్ మా ర్కెట్‌గా గుర్తించిన భూషణరావుపేటలో గోదాం నిర్మాణానికి సరపడా స్థలం ఉందని రైతులు చెబుతున్నారు. గంభీర్‌పూర్, చింతకుంట, తక్కళ్లపెల్లి, అంబారిపేటలోనూ అనువైన స్థలాలు ఉన్న ట్లు ఏకంగా అధికారులే గుర్తించారు. కథలాపూర్‌లో ఏఎంసీ కార్యాలయం సమీపంలోనే స్థలం గుర్తించి పలుమార్లు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. అయినప్పటికీ ఏళ్ల తరబడి అడుగు ముందుకు పడటంలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నిల్వ కోసం మార్కెటింగ్ శాఖతోపాటు గిడ్డంగుల సంస్థ, పౌర సరఫరాల శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గోదాములు నిర్మించే అవకాశాలు న్నాయి. పైగా నాబార్డు ఆర్థిక సహకారం కూడా అందిస్తుంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టిసారించి ధాన్యం నిల్వల కోసం గోదాముల నిర్మాణాలు చేపట్టాలని మండల రైతులు కోరుతున్నారు.
ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితం
ధాన్యం సేకరణలో తీవ్రమైన జాప్యం
త్వరగా నిర్మించాలంటున్న రైతులు


