జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ.. అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఫలితంగా బల్దియాలో పనిచేసేందుకు బదిలీపై రావాలంటేనే అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మున్సిపాలిటీలో నెల వ్యవధిలోనే అటు ఏసీబీ అధికారులు, ఇటు విజిలెన్స్ అధికారులు ఏకధాటిగా 16గంటలకు పైగానే సోదాలు చేసి ప్రతి ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బల్దియాలోని ప్రతి విభాగంలోనూ అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అదే సమయంలో ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్‌తోపాటు పలువురు బదిలీపై వెళ్లారు. తాజాగా ఇక్కడకు కమిషనర్‌గా సత్యప్రణవ్, ఇతర అధికారులు వచ్చారు. అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపాలిటీలో పనిచేసేందుకు సదరు అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిపనిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రజలకు సత్వర సేవలు అందించలేకపోతున్నారు. ఏదైనా సమస్యతో వస్తే తీవ్రమైన జాప్యం జరుగుతుండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ సమస్యను వినేవారు.. పరిష్కరించేవారు లేరా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నూతన కమిషనర్‌కు సవాళ్లే..
నిత్యం ఫిర్యాదులు, ఏసీబీ, విజిలెన్స్ అధికారుల దాడుల నేపథ్యంలో ఇక్కడ పనిచేసిన కమిషనర్ పనిచేస్తున్న స్పందన బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో గ్రూప్–1 అధికారి సత్యప్రణవ్ నియమితులయ్యారు. అయితే ఇక్కడ కమిషనర్‌గా పనిచేయాలంటే సవాల్‌తో కూడుకున్నదే. మున్సిపాలిటీలో అనేక అవినీతి అక్రమాలు చోటుచేసుకుని.. చివరకు ఏసీబీ, విజిలెన్స్ తనిఖీల వరకు వెళ్లింది. అధికారుల సోదాల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. ముఖ్యంగా ముటేషన్లకు సంబంధించి అక్రమాలు, పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం, ట్రేడ్ లైసెన్స్, ఇంజినీరింగ్ సెక్షన్, టెండర్లు సక్రమంగా లేకపోవడం, మున్సిపల్ కాంప్లెక్స్‌కు టెండర్ వేయకపోవడం, శానిటేషన్‌లో అక్రమాలు, ఇలా అనేకం గుర్తించారు. ప్రతి విభాగం ఫైళ్లను పట్టుకెళ్లారు. సదరు ఫైళ్లను పరిశీలిస్తున్న అధికారులు.. వాటిపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రస్తుతం వివిధ పనుల నిమిత్తం ప్రజలు దరఖాస్తు చేసుకున్నా.. సకాలంలో సేవలు అందడం లేదు.
గాడిన పడేనా..?
మున్సిపల్‌కు ఇటీవలే కొత్త పాలకవర్గం ఏర్పడింది. చైర్‌పర్సన్‌గా సమిండ్ల వాణి నియమితులయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మున్సిపాలిటీ గాడినపడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉంది. రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ సెక్షన్, ఎస్టాబ్లీష్‌మెంట్ సెక్షన్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.
వైస్ చైర్మన్‌కు కుర్చీ ఎక్కడ..?
ఫిబ్రవరి 16న పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెల్సిందే. అయినప్పటికీ బల్దియాలో వైస్ చైర్మన్ జీనత్ పర్వీన్ మున్నాకు చాంబర్ కేటాయించలేదు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వైస్ చైర్మన్‌గా ఉన్నప్పటికీ చాంబర్ కేటాయించడం లేదని ఆరోపించారు.
మున్సిపాలిటీలో ప్రజలు ఇళ్ల నిర్మాణ అనుమతులు, మ్యూటేషన్లు, అసెస్మెంట్లు ఇలా అనేక పనుల నిమిత్తం దరఖాస్తు చేసుకుంటారు. నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణ అనుమతులు 21రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవానికి వారం రోజుల్లోనూ ఇవ్వొచ్చు. అయినప్పటికీ అధికారులు గడువు ముగిసినా రోజుల తరబడి ఫైల్‌ను దగ్గర ఉంచుకుని.. ఆచితూచిగా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నట్లు తెలిసింది. మరోవైపు వేసవికాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఇళ్లు నిర్మించుకునేవారికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ముటేషన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది.


