ఘనంగా బీరయ్య పట్నాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బీరయ్య పట్నాలు

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

ఆరుతడి పంటలకు రాయితీ కల్పించండి ● బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ● జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ వసంత

రాయికల్‌: మండలంలోని అల్లీపూర్‌లో బుధవారం బీరయ్య పట్నాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆయనను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. సర్పంచ్‌ గౌతమి, ఎంపీటీసీ మోర వెంకటేశ్వర్లు, సంఘ నాయకులు ఉన్నారు.

ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

రాయికల్‌: మండలంలోని రామోజీపేటలో శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజు అగ్నిగుండాల ప్రవేశం చేపట్టారు. శివసత్తులు, భక్తులు అగ్నిగుండాలు దాటి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.

జగిత్యాలటౌన్‌: అరుతడి పంటల సాగును ప్రోత్సహించేందుకు మద్దతుధరతోపాటు క్వింటాల్‌కు రూ.వెయ్యి ప్రోత్సాహకం అందించాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి కోరారు. ఆరుతడి పంటల సాగుకు ప్రధాన అడ్డంకిగా మారిన కోతుల బెడద నివారణకు జిల్లాకో స్టెరిలైజేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎంకు లేఖ రాశారు. ఆయిల్‌ పాం సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న రాయితీని ఆరుతడి పంటలకూ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ అందించగా.. కేసీఆర్‌ కాళేశ్వరం, మిషన్‌ కాకతీయతో సాగునీటి వనరులు పెరిగాయని, అదే సమయంలో ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పడిపోయిందని పేర్కొన్నారు. కోతుల బెడద నివారిస్తే పప్పుదినుసులు, కూరగాయల సాగు పెరుగుతుందని పేర్కొన్నారు.

పోచమ్మకు బోనాలు

పెగడపల్లి: మండలంలోని బతికపల్లిలో శ్రీమద్విరాట్‌ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. సర్పంచ్‌ ముంజ మహేశ్వరి, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రమేశ్‌, మారుతి, మురళీచారి, మనోహర్‌, వెంకటేశ్వర్లు, హన్మండ్లు, రాజమౌళి, రాంమోహన్‌, కుల పెద్దలు పాల్గొన్నారు.

మామిడి రైతులను ఆదుకోవాలి

రాయికల్‌: మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. మండలంలోని ధర్మాజీపేటలో అగ్ని ప్రమాదంలో మామిడితోట కాలిపోయి నష్టపోయిన రైతు లావుడ్య సురేష్‌ను బుధవారం పరామర్శించారు. మామిడి రైతులు కొన్నేళ్లుగా వివిధ కారణాలతో నష్టపోతున్నారని తెలిపారు. దీనికితోడు అగ్ని ప్రమాదాల్లో తోటలు కాలిపోయి నష్టం రెండింతలైందన్నారు. ఆమె వెంట నాయకులు బర్కం మల్లేష్‌, లావుడ్య నందునాయక్‌, మారంపల్లి సాయికుమార్‌, తిరుపతి, రాంప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement