ధర్మపురి: మహిళా సంఘాల్లో పొదుపు చేసిన డబ్బుల్లో అనేక అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయి. వీటితో సంఘాల్లో గొడవలు పడి మహిళా సంఘాలు రోడ్డున పడి విమర్శలకు తావిచ్చిన సంఘటనలున్నాయి. వీటిని అరికట్టడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రవేశపెట్టిన కటాఫ్ షీట్ల విధానం మంచి సత్ఫలితాలిస్తున్నాయని అంటున్నారు.
జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 5,450 మహిళా సంఘాలున్నాయి. ప్రతిరోజు మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు, పొదుపు డబ్బుల లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే నమోదు చేయడంతో పాటు పుస్తకాల్లో జమ, ఖర్చులు నమోదు చేస్తున్నారు. బ్యాంకుల్లో జమ చేసిన డబ్బులు, రుణ వాయిదాల చెల్లింపులు తదితర వాటిని పుస్తకాల్లో రాయడంలో వీవోఏలు చాలా చోట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో మహిళా సంఘాలు చెల్లించిన డబ్బుల్లో స్పష్టత లేకుండాపోతోంది. పుస్తకాలు, కంప్యూటర్‌లో లెక్కలన్నీ ఒకేలా లేకపోవడంతో సంఘాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి.
కటాఫ్ షీట్లతో అక్రమాలకు చెక్
కేంద్రం ప్రవేశపెట్టిన కటాఫ్ షీట్ల విధానంతో అక్రమాలు జరగకుండా తోడ్పడుతుంది. కటాఫ్ షీట్ల తయారీతో పొదుపు సంఘం ఆర్థిక స్థితిగతులను సభ్యులతోపాటు ఉన్నతాధికారులు సులభంగా గుర్తించడానికి వీలుంటుంది. ఎక్కడైనా వీవోఏలు, గ్రూప్ లీడర్లు అక్రమాలకు పాల్పడితే ఆన్‌లైన్ ద్వారా నిమిషాల్లో తెలిసిపోతుంది.
ఆర్థిక సంఘాల పొదుపు సంఘలకు సంబందించిన లెక్కల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా పొదుపు సంఘాల వారిగా కటాఫ్ షీట్లను తయారు చే స్తున్నారు. లెక్కలన్నీ ఆన్‌లైన్లో నమోదు చేసి సంఘాల్లో నమ్మకం కలిగేలా చేస్తుంది.
– రఘువరణ్, డీఆర్డీవో
జిల్లాలో మొత్తం గ్రామైక్య సంఘాలు 3
మండలాలు 20
గ్రామాలు 380


