● వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు
మెట్‌పల్లి/కోరుట్లరూరల్: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మెట్‌పల్లిలోని మున్సిపల్ కార్యాలయంలో.. కోరుట్లలో మహిళా స్వశక్తి సంఘాల సభ్యులతో కలిసి మహిళా వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్‌చైర్మన్ ఓంకారి నవీన్, మెట్‌పల్లి, కోరుట్ల బల్దియాల కమిషనర్లు శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాసరావు, కాంగ్రెస్ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
టీబీ నిర్ధారణకు ఉచిత పరీక్షలు
జగిత్యాలరూరల్: టీబీ నిర్ధారణకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలనెలా ఉచిత పరీక్షలు నిర్వహించడంతోపాటు, మందులు అందించనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ, ఎక్స్‌రే క్యాంప్‌ను మంగళవారం ప్రారంభించారు. సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో చాలామంది టీబీ, ఎక్స్‌రే టెస్ట్‌లు చేయించుకున్నారని తెలిపారు. టీబీగా అనుమానం ఉంటే వెంటనే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి రాధరెడ్డి, నర్సింగ్ అధికారి దామోదర్, కుద్దుస్ పాల్గొన్నారు.
మోటార్లకు మీటర్లు పెడతారా..?
కథలాపూర్(వేములవాడ): విద్యుత్ రంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి అన్నారు. మండలంలోని భూషణరావుపేటలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి మంగళశారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం విద్యుత్ సరఫరా లేకపోతే వ్యవసాయం నిలబడదన్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలని గతంలో కేంద్రం ఆదేశాలిస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించిందని, ఇప్పుడు ప్ర జాభిప్రాయం లేకుండా.. అసెంబ్లీలో చర్చ లే కుండా విద్యుత్ డిస్కం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, పుర్కుటపు గంగారెడ్డి, గడ్డం శేఖర్‌రెడ్డి, అంజయ్య, దేవయ్య పాల్గొన్నారు.
కిక్కిరిసిన కొండగట్టు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారికి సామూహిక అభిషేకాలు చేశారు. అంజన్న పెద్ద జయంతి సందర్భంగా దీక్షాపరులు సమర్పించిన ముడుపులను ఈనెల 29న వేలం వేయనున్నట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. బియ్యం, కొబ్బరికాయలు, ఎండుకుడుకలు, మాలలు వేలం వేస్తామన్నారు.


