జగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకున్నా.. రైతులు వానాకాలం సాగుకు సిద్ధపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యంగానైనా వచ్చే అవకాశం ఉందన్న వాతావరణ శాస్త్రవేత్తల ప్రకటనతో పనులు ప్రారంభించారు. మరోవైపు రోహిణికార్తె కూడా ప్రవేశించడంతో పొలాల్లో పశువులు ఎరువు చల్లుతూ.. లోతు దక్కులు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
ఎరువులు చల్లే పనుల్లో..
వర్షాలు కురవకముందే.. పొలాలు సిద్ధం చేస్తుంటారు. ఎరువులను చల్లుతున్నారు. ట్రాక్టర్ సహాయంతో పొల్లాన్ని కలియదుతున్నారు. పంటకు హానిచేసే పురుగులు భూమిలో ఉంటే అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. భారీవర్షం కురవగానే విత్తనాలు వేయనున్నారు. పశువుల ఎరువు లేని రైతులు గొర్రెలు, మేకలు, లేదా ఆవుల మందను పెట్టిస్తున్నారు. మందను బట్టి రోజుకు రూ.2000 నుంచి రూ.4000 తీసుకుంటున్నారు.
కూలీల కోసం..
గ్రామాల్లో కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం పురుషునికి రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు ఇస్తున్నారు. ఆడవారికి రూ.50వేల వరకు ఇస్తున్నారు. జిల్లాలో 4.24 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు వంటి పంటలు సాగుచేసే అవకాశం ఉండటంతో కూలీల అవసరం ఎక్కువగా ఉంది.
రసాయన ఎరువుల కొనుగోలుకు మొగ్గు
యూరియా వంటి రసాయన ఎరువులకు కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో రసాయన ఎరువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ముందు జాగ్రత్తగా వానాకాలం సీజన్‌కు సరిపోయే యూరియా, కాంప్లెక్స్ కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకునేందుకు సిద్ధపడుతున్నారు.
రుణాల రెన్యువల్ కోసం బ్యాంకులకు..
వాస్తవంగా రైతులు మే, జూన్‌లో బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారు. ఏడాదిలోపు రెన్యువల్ చేసుకుంటారు. పంటలు విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బుతో పంట రుణం చెల్లించి, తిరిగి తీసుకుంటారు. బ్యాంకర్లు కేవలం రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకే రుణం ఇస్తుండటంతో బావులు తవ్వకం.. పైపులైన్లు వేసేందుకు భూములు కుదవపెట్టి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటున్నారు.


