జగిత్యాల: భూగర్భజలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తేనే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని తాజాగా మున్సిపాలిటీలకు సీడీఎంఏ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ తంలో ఇంకుడు గుంత చూపిస్తేనే ఇంటి అనుమతి ఇచ్చేవారు. కాగా, చాలా చోట్ల ప్లానింగ్‌లో ఇంకుడుగుంతలు ఉంటాయి కానీ, నిర్మాణాలు మాత్రం చేపట్టరు. దీనిపై మున్సిపల్ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉండేవి. ప్రస్తుతం ఇంటి నిర్మాణాలు, బహుళ అంతస్తు ల భవనాలకు ఇంకుడుగుంత ఉంటేనే అనుమతి వ్వాలని.. టౌన్‌ప్లానింగ్, శానిటేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశాలు జారీ అ య్యాయి. కాగా, పట్టణాలు, గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. ఈనేపథ్యంలో ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంత నిర్మాణం జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు
లక్షకు పైగా జనాభా దాటిన ప్రతీ మున్సిపాలిటీలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడితే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోంది. జల్ సంచాయ్ జన్ భగీదరి 2.0 పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు, అత్యధికంగా నిర్మాణాలు చేపడితే ర్యాంకులను బట్టి రూ.కోటి వరకు నిధులు మంజూరు చేయనున్నారు. ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీలో 170 ఇంకుడు గుంతలు నిర్మించేలా చర్యలు చేపట్టారు.
ప్లానింగ్‌లో ఉంటుంది.. నిర్మాణంలో ఉండదు
పలువురు ఇంటి నిర్మాణదారులు మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంటే ప్లానింగ్‌లో ఇంకుడు గుంతను చూపుతున్నారు. తర్వాత నిర్మించడం లేదు. ఫైల్‌లో మాత్రం ఇంకుడుగుంత నిర్మించుకున్నట్లే ఉంటుంది. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఒక ఇంకుడుగుంతకు యజమానులు రూ.3 వేల నుంచి 4 వేలు డబ్బు కూడా చెల్లిస్తారు. కాగా, ఇప్పటికే కొత్తగా నిర్మాణం చేపట్టే వారి వద్దకు సర్వే బృందాలను పంపించాలని, యజమానులతో పాటు, మేసీ్త్రలు, భవన నిర్మాణ కార్మికులకు ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నిర్మాణం చేపట్టేలా చర్యలు
మున్సిపాలిటీలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే వారు కచ్చితంగా ఇంకుడుగుంత నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువ సంఖ్యలో ఇంకుడుగుంతలు నిర్మిస్తే జల్ సంచాయ్ జన్ భగీదరి 2.0 పథకం కింద అత్యధిక నిధులు వస్తాయి.
– శ్రీనివాస్, టీపీవో, జగిత్యాల


