రాజన్న ఆలయ అభివృద్ధిపై శీతకన్ను సిమెంటు వినియోగంపై సర్వత్రా విమర్శలు కోడెమొక్కులకు భక్తుల ఎదురుచూపులు వచ్చే ఏడాదికి సిద్ధం చేస్తామని అధికారుల ధీమా
సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పునర్నిర్మాణం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంటే, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం అభివద్ధి పనులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. యాదాద్రిలో శాస్త్రబద్ధంగా, ప్రణాళికాబద్ధంగా నిర్మాణం సాగగా.. వేములవాడలో అస్పష్టత, సమన్వయ లోపంతో విమర్శల పాలవుతోంది. ఈ మధ్య పనులు కాస్త ఊపందుకున్నప్పటికీ.. సిమెంట్ నిర్మాణాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఈ సిమెంటు నిర్మాణాలు ఎంతకాలం ఉంటాయి? కోడెమొక్కుల దర్శనాలు భక్తులకు తిరిగి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? అన్న అంశాలు నేటికీ ప్రశ్నలుగానే మిగులుతున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ.. రూ.1200 కోట్లతో యదాద్రి, రూ.225 కోట్లతో బాసర ఆలయాలకు దక్కినస్థాయిలో గౌరవం దక్కకపోవడం, వేములవాడ ఆలయానికి కేవలం రూ.150 కోట్లే వెచ్చించడంతో రాజన్న భక్తులు చిన్నబుచ్చుకుంటున్నారు. మరోవైపు అధికారులు వచ్చే ఏడాది మార్చి నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేసే దిశగా వేగంగా పనులు సాగిస్తున్నారు.
ఎములాడ అంటే ఇలానా?
యాదాద్రికి దక్కిన ప్రాధాన్యం వేములవాడకు దక్కడం లేదన్నది సుస్పష్టమని భక్తులు వాపోతున్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్‌ప్లాన్‌లోనే అనేక లోపాలున్నాయని విమర్శిస్తున్నారు. దర్శనాల విషయంలో రోజుకో నిర్ణయం, కోడె మొక్కులు ఒకచోట, స్వామి దర్శనం మరోచోటపైనా భక్తులు పెదవి విరుస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల నిధులతో చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణం ప్రతిపాదనలు సిద్ధం కాకుండానే శంకుస్థాపన జరగడం, టెండర్లు ఆలస్యంగా పూర్తవడం ప్రణాళికా లోపాలను బట్టబయలు చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యాదాద్రిలో సంపూర్ణ రాతి నిర్మాణం కొనసాగించగాం వేములవాడలో మాత్రం 700కి పైగా కాంక్రీట్ పిల్లర్లతో నిర్మాణ ప్రణాళిక రూపొందించడం, ఆ పిల్లర్లకు రాతి పలకలు అంటిస్తే.. ప్రాచీన వైభవం దెబ్బతింటుందన్న భక్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఆలయాన్ని కాంక్రీట్ మయం చేయడం సరైనదేనా?’ అన్న సందేహాలు భక్తులు లేవనెత్తుతున్నారు. మరోవైపు కాంక్రీట్ నిర్మాణాల మన్నిక ఎంతకాలం అన్న భక్తుల ప్రశ్నకు సమాధానం నేటికీ దొరకడం లేదు. ఈ విమర్శలేవీ అటు ప్రభుత్వం కానీ, ఇటు ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. 2027 మార్చి నాటికి ఎలాగైనా ఆలయాన్ని సిమెంటు పిల్లర్లతోనే అందుబాటులోకి తీసుకువస్తామని ధీమాగా ఉన్నారు.
యాదాద్రి మీద అలా..
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వయంగా పర్యవేక్షించారు. వైటీడీఏ వీ.సీ. కిషన్ రావు, ఇతర అధికారుల నిరంతర పరిశీలనలో రూ.1,200 కోట్ల వ్యయంతో అద్భుత నిర్మాణంగా తీర్చిదిద్దారు. పూర్తిగా కృష్ణశిలతో రూపుదిద్దుకున్న ఈ నిర్మాణానికి దాదాపుగా 1,200 మంది శిల్పులు పనిచేశారు. అగమశాస్త్రాల ప్రకారం నిర్మించిన ఈ ఆలయం ఇంటర్‌లాకింగ్ టెక్నాలజీతో వెయ్యేండ్లు నిలిచి ఉండేలా బాధ్యతలను ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థ ఎల్‌అండ్‌టీకి అప్పటి ప్రభుత్వం అప్పగించింది. రాతి నిర్మాణాల కోసం చైనా లాంటి ఇతర దేశాలకు చెందిన రాతిని పరిశీలించారు. ఎక్కడా సిమెంట్ వినియోగం లేకుండా సంప్రదాయ పద్ధతులతో యాదాద్రి పునర్నిర్మాణం ఆలయ నిర్మాణంగానే కాదు, ఒక ఆధ్యాత్మిక నగర రూపకల్పనగా నిలిచింది.


