ట్రాఫిక్‌ సిబ్బంది ఆరోగ్య రక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ సిబ్బంది ఆరోగ్య రక్షణకు చర్యలు

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

జగిత్యాలక్రైం: ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఆరోగ్య రక్షణకు జిల్లా పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రంలో సిబ్బందికి కూలింగ్‌ గాగుల్స్‌, వాటర్‌ఫ్లాస్క్‌లు పంపిణీ చేసి మాట్లాడారు. రోడ్లపై వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం మాత్రమే కాకుండా రోడ్డు ప్రమాదాల నివారణలో ట్రాఫిక్‌ పోలీసుల పాత్ర కీలకమన్నారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సిబ్బంది తరచూ నీరు తాగుతూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని సూచించారు. అవసరమైతే కొద్దిసేపు నీడలో విశ్రాంతి తీసుకోవాలని, ఎండ తీవ్రతను నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఏఎస్పీ చేతన్‌ నితిన్‌, డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, పట్టణ సీఐ కరుణాకర్‌, ట్రాఫిక్‌ ఎస్సై మల్లేశం, పట్టణ ఎస్సై సుప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు

బాధితుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి 14 దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

ఉత్సాహం నింపిన వేసవి శిక్షణ శిబిరం

జగిత్యాల: వేసవి శిక్షణ శిబిరంలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఈ శిబిరం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిందని డీఈవో రాము అన్నారు. ఈనెల 11 నుంచి 25 వరకు ధరూర్‌ క్యాంప్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శిబిరంలో అబాకస్‌, డ్రాయింగ్‌ తదితర గేమ్స్‌లో శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్‌ పెంచేలా అందరు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయులు అమర్‌నాథ్‌రెడ్డి, క్వాలిటీ కో ఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చెట్టును ఢీకొన్న పోలీసు వాహనం

జగిత్యాలక్రైం: విధి నిర్వహణలో ఉన్న పోలీసు వాహనం అర్ధరాత్రి అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఆరుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో దేవిశ్రీ గార్డెన్స్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న క్యూఆర్‌ కోడ్‌ సిబ్బంది పోలీసు బొలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రైతులను దగా చేస్తున్న కాంగ్రెస్‌

కథలాపూర్‌(వేములవాడ): వరి ధాన్యం తూకంలో మోసం, లారీల కొరతతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి మండిపడ్డారు. సోమవారం మండలంలోని కలిగోటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. వరిధాన్యం బస్తాలో 40 కిలోల తూకం వేయాల్సి ఉండగా, 43 కిలోలు తూకం వేసి రైతులను నట్టేటా ముంచుతున్నారన్నారు. ఇంత దోపిడీ జరుగుతుంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బీఆర్‌ఎస్‌ హయంలో వరిధాన్యం త్వరగా తూకం వేయించి నెలరోజుల్లోనే ముగించామన్నారు. నాగం భూమయ్య, నాగేశ్వర్‌రావు, ఎండీ రఫీ, రమేశ్‌, వేముల గంగరాజం, సీతారామ్‌నాయక్‌, గంగారెడ్డి, బోదాస్‌ అంజయ్య, కల్లెడ నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement