● కలెక్టర్ బి.సత్యప్రసాద్
మల్యాల/కొడిమ్యాల: తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని తక్కళ్లపల్లి, బల్వంతాపూర్, రామన్నపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సోమవారం సందర్శించి మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అలాగే కొడిమ్యాల మండలం డబ్బుతిమ్మాయపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. డీఎస్‌వో జితేందేర్, తహసీల్దార్లు శ్రీనివాస్, నరేశ్, ఎంపీడీవోలు స్వాతి, స్వరూప, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ స్వామి, ఆర్‌ఐ రాణి తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా మార్కెట్ విలువల ప్రక్రియ
జగిత్యాల: మార్కెట్ విలువల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మార్కెట్ విలువల సవరణపై జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబరు 41 రెవెన్యూ ప్రకారం భూ మార్కెట్ విలువలకు సంబంధించిన మార్గదర్శకాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల వర్గీకరణ, వ్యవసాయేతర భూములు తదితర అంశాలపై వివరించారు. పట్టణప్రాంతాలు, గ్రామపంచాయతీలు, మున్సిపల్ ప్రాంతాల్లో ప్రభుత్వం చేసిన కమిటీలు, బాధ్యతలు విధానాలు, అనుసరించాల్సిన చర్యలపై అవగాహన ఉండాలన్నారు. అడిషనల్ కలెక్టర్ లత, ఆర్డీవో జివాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


