విద్యుత్‌ శాఖలో సిబ్బంది కొరత | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖలో సిబ్బంది కొరత

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

● అన్‌మ్యాన్డ్‌ ఉద్యోగులపై భారం ● వినియోగదారులకు అందని సేవలు

పెగడపల్లి: విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఫలితంగా రైతులు, గృహ వినియోగదారులకు సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరిపడా సిబ్బంది లేక అదనపు భారం పడుతోందని ఉన్న సిబ్బంది, అన్‌మ్యాన్డ్‌ ఉద్యోగులు అంటున్నారు. పెగడపల్లి మండలంలో ఆరు విద్యుత్‌ సబ్‌ స్టేషన్లున్నాయి. వీటి పరిధిలో సుమారు 9,200 వ్యవసాయ కనెక్షన్లు, 18,420 గృహ వినియోగదారులున్నారు. బతికపల్లి, పెగడపల్లిని రెండు సెక్షన్లుగా విభజించారు. పెగడపల్లి సెక్షన్‌లో ఏఈఈ, ఏఎల్‌ఎం, జేఎల్‌ఎం, సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఆరు సబ్‌ స్టేషన్లలో ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా ఎక్కడైనా సమస్య ఏర్పడితే పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ప్రజలు అంటున్నారు. రాత్రి సమయంలో విద్యుత్‌ సమస్య ఏర్పడితే ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యూజ్‌ పోయినా రైతులే వేసుకోవాల్సి వస్తోంది. ఇటీవల నంచర్లలో ట్రాన్సఫార్మర్‌ వద్ద మరమ్మతు చేస్తుండగా ఓ రైతు మృతి చెందాడు. సిబ్బంది కొరతపై గొల్లపల్లి సబ్‌ డివిజన్‌ ఏడీఈ వరుణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సిబ్బంది కొరత విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సేవల్లో అవాంతరాలు ఎదురైతే ఉన్న సిబ్బందితో సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద రైతులు, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మరమ్మతు చేయొద్దని, విద్యుత్‌ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement