20 నుంచి 100 శాతం పెంచేలా ప్రతిపాదనలు సవరించిన మార్కెట్ విలువలు కసరత్తు చేస్తున్న అధికారులు
జగిత్యాల: వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే ఉన్న పాత ధరలు కొత్త ధరలతో వివరాలు నమోదు చేస్తున్నారు. దాదాపు 20 నుంచే 100 శాతం పెంచేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు సమాచారం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల విలువలకు సంబంధించిన సవరణ పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన మార్కెట్ విలువలు, వ్యవసాయ భూముల వివరాలు ఉండటంతో రెవెన్యూ సిబ్బంది సహకారంతో పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే అదనపు కలెక్టర్ లత ఆధ్వర్యంలో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లతో సమావేశమై భూముల విలువల సవరణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రస్తుత రికార్డు, మార్కెట్‌లోని భూముల విలువలను పరిగణనలోకి తీసుకుని కచ్చితమైన వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాలు, సర్వేనంబర్లు, వర్గీకరణ వారీగా మార్కెట్ విలువ పరిశీలించి పొరపాట్లు లేకుండా అధికారులకు నివేదిక పంపించారు. ఫార్మట్–1 నుంచి ఫార్మట్–4 వరకు వివరాలను సమగ్రంగా సిద్ధం చేశారు.
నివాసాలు, రహదారులుంటే పెరిగే అవకాశం
రహదారులు, నివాసాలుంటే మార్కెట్ విలువ పెరిగే అవకాశం ఉంది. చాలాచోట్ల భూభారతి చట్టంలో ఉన్న దరఖాస్తులకు సబ్‌రిజిస్ట్రార్ వ్యవసాయ ధరలకు అత్యధికంగా వ్యత్యాసం ఉండటంతో కొత్తగా ధరలు నమోదు చేస్తున్నారు. ఒకరాన రూ.2లక్షలు ఉంటే తాజాగా అది రూ. 5లక్షలకు పెరిగే అవకాశం ఉంది. అలాగే భవనాలు, రహదారులు, జాతీయ రహదారులున్న చోట్ల రూ.10 లక్షల వరకు పెరిగే అవకాశాలున్నాయి.
వ్యవసాయేతర స్థలాల్లో
వ్యవసాయేతర ఆస్తుల క్రయవిక్రయాల్లో సుమారు 7.5శాతం స్టాంప్ డ్యూటీ వేస్తుంటారు. భూముల ధరలు పెరిగితే ప్లాట్లు, రిజిస్ట్రేషన్ల ద్వారా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సుమారు 10 శాతం వరకు పెంచే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ జాతీయ రహదారులపై నివాసాలుంటే అక్కడ మరింత పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
కొనేవారికి ఇబ్బందే
భూముల విలువలు అధికంగా పెరిగితే రిజిస్ట్రేషన్ ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలుంటాయి. భవనాలు, రహదారులు ఉన్న భూములు కొనాలంటే ఇంకా ఇబ్బందికరంగానే ఉంటుంది.
కసరత్తు పూర్తి
అధికారులు భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణకు సంబంధించి ఫార్మట్ సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు నివేదికను సమర్పించినట్లు తెలిసింది. భూముల రిజిస్ట్రేషన్ విలువలకు సంబంధించి ప్రక్రియ పూర్తయినట్లు జగిత్యాల ఎస్‌ఆర్వో సుజాత తెలిపారు.


