జగిత్యాలఅగ్రికల్చర్: వానాకాలం సీజన్‌లో రైతులు దొడ్డు వరిరకాలు తగ్గించి.. సన్నరకాల వైపు దృష్టి సారించేలా చూడాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖకు సూచించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఫ్లెక్సీలు, పోస్టర్లు, కరప్రతాలు, రైస్‌మిల్లులు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు సన్నాల్లో కేవలం 8 రకాలను మాత్రమే వ్యవసాయ వర్సిటీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తుండడంతో వర్సిటీ రూపొందించిన ఇతర రకాలు, ప్రైవేటు కంపెనీల రకాలు సాగు చేయవచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు ఇష్టమొచ్చిన రకాలు సాగు చేస్తే రూ.500 బోనస్ వర్తిస్తుందా..? లేదా..? అని రైతులు సందేహిస్తున్నారు.
వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న రకాలు
జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. అందులో కనీసం 1.50 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేస్తారు. వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న రకాల్లో బీపీటీ–5204(సాంబమసూరి), ఆర్‌ఎన్‌ఆర్–15048(తెలంగాణ సోనా), కేఎన్‌ఎం–1638 (కూనారం వరి–2), జేజీఎల్–1798(జగిత్యాల సన్నాలు), జైశ్రీరామ్, హెఎంటీ సోనా వరంగల్–44(సిద్ది), డబు్?ల్జఎల్–962 మాత్రమే ఉన్నాయి. ఈ రకాలు అధిక దిగుబడి ఇస్తాయని, రైతులకు అధికకాదాయం వస్తుందని ప్రచారం చేస్తోంది.
ప్రచారం చేస్తున్న రకాల్లో సమస్యలు
● బీపీటీ: ఈ రకం దీర్ఘకాలిక పంట. మే15 లోపు నార్లు పోసుకుంటే మంచిదని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు.
● ఆలస్యమైతే తెగుళ్లు, పురుగులు ఆశించే అవకాశం ఉంది.
● దోమపోటు, మెడవిరుపు, ఆకు ఎండు తెగులు ఆశిస్తుంది.
● బియ్యం నాణ్యత ఉన్నా.. దిగుబడి అంతగా రాదు.
● జేజీఎల్–1798: ఇది 125 రోజుల పంట.
● గింజ నాణ్యత అంతబాగా లేదు.
● జైశ్రీరాం: గడ్డి మాదిరిగా ఎత్తు పెరుగుతుంది.
● ఈదురుగాలలకు నేలవాలుతుంది.
● దిగుబడి తక్కువ.. బియ్యం నాణ్యత చప్పచప్పగా ఉంటుంది.
● హెచ్‌ఎంటీ: బియ్యం నాణ్యత ఎక్కువగా ఉంటుంది. తినడానికి సూపర్. ఇది ఒక ప్రైవేట్ రకం.
● వరంగల్–44 : అంతగా ప్రాచుర్యం పొందలేదు.
● గొట్టాల తెగులు బాగా వస్తుంది.
● కేఎన్‌ఎం–1638: ఒక డీఏపీ, ఒక యూరియా బస్తాతో పండే రకం.
● ఎక్కువగా యూరియా వేస్తే పురుగులు, తెగుళ్లు ఆశించి దిగుబడి తగ్గుతుంది.
ఇలా వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న సన్నరకాలపై రైతులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు.
ఇతర వరి రకాలు సాగు చేస్తే అంతేనా..?
● రైతులకు 33 సన్నరకాలు అందుబాటులో ఉండగా.. కేవలం 8 మాత్రమే ఫోకస్ చేస్తుండటంపై సందేహాలు అధికమవుతున్నాయి.
● ఏ రకంలోనైనా గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2ఎంఎం కంటే తక్కువ ఉండాలి.
● పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే ఆ రకాలకు ప్రాధాన్యమిచ్చి సన్న రకం కింద రూ.500 బోనస్ వస్తుంది.
● గ్రామాల్లో ఆయా రైతులు తమకు నచ్చిన విత్తనాలు వేసి పంట పండిస్తారు.
● ఆ విత్తనం ప్రైవేట్‌ది అయినా పరిశోధన స్థానానిది అయినా పంట ఎక్కువగా వచ్చే రకాలను సాగు చేస్తుంటారు.
● రైతుకు నచ్చిన రకాలు సాగు చేస్తే.. బోనస్ వస్తుందా..? రాదా అని ఆందోళన చెందుతున్నారు.
సన్నరకాలపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టంగా వ్యవసాయశాఖకు ఆదేశాలు ఇవ్వలేదు.
● ఫలితంగా ఆయా రకాల సాగుపై గందరగోళం నెలకొంది.
● వానాకాలంలో ఏరకం ధాన్యం సాగు చేయాలనే దానిపై రైతులు మల్లాగుల్లాలు పడుతున్నారు.
● ఇదే అదునుగా వ్యాపారులు ఇతర సన్నరకాలను ప్రభుత్వం గుర్తించిన రకాలుగా చెబుతూ రైతులకు అంటగట్టే అవకాశం ఉంది.


