● ‘సీఈఐఆర్’ వినియోగించుకోవాలన్న ఎస్పీ అశోక్ ● సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన
జగిత్యాలక్రైం: సెల్‌ఫోన్ పోయినా.. చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని, సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. వివిధ ప్రాంతాల్లో చోరీకి, పోగొట్టుకున్న రూ.23 లక్షల విలువైన 117 మొబైల్ ఫోన్లను బాధితులకు శనివారం అప్పగించారు. ఫోన్ల రికవరీలో సీఈఐఆర్ వెబ్‌సైట్ ఉపయోగపడుతుందన్నారు. ఫోన్ల రికవరీకి ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారి, ఆర్‌ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.3,67,60,000 విలువైన 1,838 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. సెకండ్‌హ్యాండ్ ఫోన్ కొనేముందు ఐఎంఈఐ నంబర్ చెక్ చేసుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ చేతన్‌నితిన్, సైబర్ క్రైం ఎస్సై దినేష్, సీఈఐఆర్ టీం హెడ్ కానిస్టేబుల్ మహుముద్, కానిస్టేబుల్ అజర్, అనూష, ప్రశాంత్ పాల్గొన్నారు.
సిరికొండ టు కొండ్రికర్ల
జగిత్యాలక్రైం/కోరుట్ల: కోరుట్ల మండలం సిరికొండలో సాగే పేకాట స్థావరాన్ని నిర్వాహకులు కథలాపూర్ మండలం కొండ్రికర్ల శివారు మార్చినట్లు సమాచారం. సిరికొండలో పేకాట జోరుగా సాగుతుండడంతో ఈనెల 22న ‘జీవితాలు మూడు ముక్కలు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ క్రమంలో పోలీసులు దృష్టి సారించడంతో పేకాట నిర్వాహకులు వెంటనే మకాం మార్చారు. అలాగే కోరుట్ల పట్టణంలో కూడా పలుచోట్ల పేకాట జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ లక్షలు నిర్వాహకులు జేబులో వేసుకుంటున్నారు.
ముగిసిన ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తల కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఏప్రిల్ 27 నుంచి ఈనెల 23 వరకు 64 గ్రామాల్లో నిర్వహించారు. వ్యవసాయ పరిశోధన స్థానం, కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులతో 8 శాస్త్రవేత్తల బృందాలను ఏర్పాటు చేశారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు, పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, రసాయన ఎరువుల తగ్గింపు, ఆధునిక యంత్రాల వాడకం, నూనెగింజల పంటల సాగు తదితర విషయాలపై రైతులకు వివరించారు. చివరిరోజు జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేట, కోరుట్ల మండలం పైడిమడుగులో అవగాహన కల్పించి.. వానాకాలం పంటలపై దిశానిర్దేశం చేశారు. దాదాపు 5వేల మంది రైతులు హాజరై, తమ సాగు సందేహాలను నివృత్తి చేసుకున్నారని జిల్లా ఇన్‌చార్జి రాజేశ్ తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే కొనుగోళ్లలో జాప్యం
రాయికల్: అధికారుల నిర్లక్ష్యంతోనే కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మండలంలోని ఆలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని, బస్తాలు తరలించడం లేదని రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పంట పండించడం ఒకెత్తయితే అమ్ముకోవడం మరో ఎత్తు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్‌యాదవ్, సింగిల్ విండో చైర్మన్ దీటి రాజిరెడ్డి, సర్పంచులు స్వామిరెడ్డి, గంగాధర్, నాయకులు మల్లారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఆడెపు కృష్ణ, నందునాయక్ ఉన్నారు.


