వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు | - | Sakshi
Sakshi News home page

వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు

May 24 2026 12:57 AM | Updated on May 24 2026 12:57 AM

● 4.25 లక్షల ఎకరాల్లో పంటల సాగు ● వరి పంట వైపే రైతన్న చూపు

జగిత్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సీజన్‌లోనూ రైతులు వరిసాగు వైపే దృష్టి పెట్టనున్నారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వానాకాలం పంటలు.. కావాల్సిన రసాయన ఎరువులు, సబ్సిడీ విత్తనాలపై వ్యసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. రైతులు, అధికారులను అప్రమత్తం చేసేలా విడుదల చేసింది.

4.25 లక్షల ఎకరాల్లో ప్రధాన పంటల సాగు

ఈ సీజన్‌లో 4.25 లక్షల ఎకరాల్లో ప్రధాన పంటలైన వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, కంది పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. వరిని అత్యధిక విస్తీర్ణంలో 3.16లక్షల ఎకరాలు, పత్తి 19వేల ఎకరాలు, కంది పంట 1500, మొక్కజొన్న 35,000, పసుపు 9500, పెసర 100, అనుములు 350, సోయాబీన్‌ 800, చెరుకు 350, ఆయిల్‌ పాం 5,000, ఇతర పంటలు 37,400 ఎకరాల్లో సాగు చేయనున్నారు.

88,732 టన్నుల ఎరువులు అవసరం

జిల్లాలో ఆయా పంటల సాగుకు అనుకూలంగా రసాయన ఎరువులు నెలవారీగా జిల్లాకు రానున్నాయి. వానాకాలం సీజన్‌కు సంబంధించి 40,351 టన్నుల యూరియా, 7,768 టన్నుల డీఏపీ, 26,632 టన్నుల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 10,653 టన్నుల కాంప్లెక్స్‌, 3,329 టన్నుల సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ అవసరమని అధికారులు తేల్చారు. పంటల పెరుగుదలను బట్టి జూన్‌లో 21,786టన్నులు, జూలైలో 25,856 టన్నులు, ఆగస్టులో 19,074 టన్నులు, సెప్టెంబర్‌లో 8,707 టన్నుల ఎరువులు జిల్లాకు చేరేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 13,310 టన్నుల రసాయన ఎరువులు అందుబాటులో ఉన్నాయి.

జిల్లాకు 61,363 క్వింటాళ్ల విత్తనాలు

వానాకాలం పంటలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 58,225 క్వింటాళ్ల వరి, 90 క్వింటాళ్ల కంది, 2800 క్వింటాళ్ల మొక్కజొన్న, పెసర 8 క్వింటాళ్లు, సోయాబీన్‌ 240 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ మేరకు విత్తనాలను ప్రభుత్వ, ప్రైవేట్‌ దుకాణాల్లో సిద్ధంగా ఉంచేలా ఏర్పాటు చేశారు. 38వేల వివిధ కంపెనీల పత్తి విత్తన ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు.

పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం

పొలాల్లో తొలుత పచ్చిరొట్ట కోసం జనుము, జీలుగ విత్తనాలను రైతులు సాగు చేస్తుంటారు. 22వేల క్వింటాళ్ల జీలుగ, 4వేల క్వింటాళ్ల జనుము, 100 క్వింటాళ్ల పిల్లి పెసర విత్తనాలను 50శాతం సబ్సిడీపై సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేరకు జిల్లాకు కేటాయించారు. ప్రభుత్వ సబ్సిడీపోను.. మిగతా సొమ్మును రైతులు చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ విత్తనాలను జిల్లాలోని సింగిల్‌ విండోలు, ఆగ్రోస్‌ కేంద్రాలు, డీసీఎంఎస్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement