జగిత్యాల: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం సుమంగళి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యకు ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి మరింత స్థలం ఇస్తామన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో అధికారులు సమన్వయంతో పనిచేసి పథకాలను లబ్ధిదారులకు చేరవేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల, రాయికల్ మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకాల కింద అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి, గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఏకవచనంతో సంబోధించడం సరికాదు
రాజ్యాంగబద్దంగా ఎన్నికై న ముఖ్యమంత్రిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడం సమంజసం కాదని మంత్రి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కేటీఆర్ కుటుంబంలో కవిత కుర్చి లాక్కునేందుకు ప్రయత్నించడంతో నిత్యం అసహనానికి గురవుతున్నారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. లేదంటే కాంగ్రెస్ కార్యకర్తలు బుద్ధి చెబుతారన్నారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసించే ప్రసక్తే లేదని, 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు.
రైతులు అధైర్యపడొద్దు
గొల్లపల్లి: రైతులు ఆందోళన చెందవద్దని, వరిధాన్యం, మొక్కజొన్నను పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని మంత్రి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్, బోరుబావిని ప్రారంభించి మాట్లాడారు. తిరుమలాపూర్‌లో సమస్యల పరిష్కారానికి తనవంతు సహకరిస్తానని, రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు సహకరించాలని మంత్రి కోరారు.


