జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలు, చిన్నారులకు సత్వర సేవలందించాలని అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్ అన్నారు. శుక్రవారం భరోసా కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. మహిళల రక్షణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, మహిళలు, చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లైంగిక దాడులకు గురైనవారికి సత్వర సాయం, న్యాయ పరిరక్షణ, మానసిక ధైర్యం కల్పించడం అత్యంత కీలకమన్నారు. జిల్లాలో ఎక్కడైనా పోక్సో, అత్యాచార కేసులు నమోదైతే వెంటనే బాధితులను భరోసా సెంటర్‌కు తీసుకువచ్చి చట్టపరంగా సూచనలు, సేవలు అందించాలని నిర్వాహకులకు సూచించారు. సీసీఎస్ సీఐ శ్రీనివాస్, పట్టణ ఎస్సై సుప్రియ, సిబ్బంది పాల్గొన్నారు.


