ఫిర్యాదులు వస్తే చర్యలు
కోరుట్ల: ఎక్కడైనా సరే ఇరువురి మధ్య గొడవలు, భూ వివాదాలు, భార్యాభర్తల పంచాయితీలు జరిగినప్పుడు కక్షిదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఠాణాలో కేసులు నమోదు చేసే క్రమంలో ఇరువర్గాల నుంచి పెద్ద మనుషుల ప్రమేయం చోటు చేసుకుంటుంది. కేసులు నమోదు కావడంలో ఠాణాల్లో ఆలస్యం జరుగుతుండటం, కోర్టు కేసులు అంటే మున్ముందు ఎలా ఉంటుందోన్న భయంతో ఫిర్యాదుదారులు చివరికి పెద్ద మనుషులను ఆశ్రయించడం షరామాములుగా మారింది. ఇక్కడ నుంచి పెద్ద మనుషులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఠాణా నుంచి పంచాయితీ తమ చేతిలోకి వచ్చిందే తడువుగా పెద్ద మనుషులు రూ.లక్షల్లో డిపాజిట్‌లు పెట్టుకోవడం, తర్వాత పంచాయితీని దపాల వారీగా కొనసాగించడం జరుగుతోంది. ఈ క్రమంలో పెద్ద మనుషులు విందులు, వినోదాలు, రాకపోకలకు డిపాజిట్ డబ్బుల నుంచి ఎడాపెడా ఖర్చులు చేయడం, చివరికి ఫిర్యాదుదారుల పంచాయితీలు ఏ మేరకు పరిష్కారం అవుతున్నాయో తెలియదు..కానీ పెద్ద మనుషుల చేస్తున్న అడ్డగోలు ఖర్చులకు మాత్రం లెక్కా పత్రం ఉండదు.
నిండా మునుగుతున్నారు
జిల్లాలో రోజూ ఏదో ఓ చోట పెద్ద మనుషుల పంచాయితీల్లో పేదవర్గాలు చాలా మేర నలిగిపోతున్నాయి. పోలీస్‌స్టేషన్లకు చేరుతున్న పంచాయితీల్లో మూడోంతుల మేర తిరిగి పెద్దమనుషుల చేతుల్లోకి చేరి నలుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. సంఘాలు, కుల పెద్ద మనుషులు స్వచ్ఛందంగా ఫిర్యాదుదారుల నుంచి ఎలాంటి డిపాజిట్లు తీసుకోకుండా, అనవసర ఖర్చులు చేయకుండా సమస్యలు పరిష్కరించడం మంచిదే.. కానీ, దానికి విరుద్ధంగా వ్యవహరించడంతో అసలే గొడవలు, కేసుల ఇబ్బందుల్లో ఉన్న ఫిర్యాదుదారులు మరిన్ని సమస్యల్లో కూరుకుపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్ద మనుషులు ఉద్దేశపూరితంగా వివాదాలను పెంచడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడితో సరిపెట్టుకోకుండా పంచాయితీలు చేసి జరిమానాలు, బహిష్కరణలు వంటి నిర్ణయాలు తీసుకోవడం సమస్యలకు కారణమవుతోంది. ఠాణాల్లో కేసులు నమోదు చేయడంలో జాప్యం, కొన్ని చోట్ల పెద్ద మనుషుల పరిధిలోకి సమస్యలను పంపడం వంటివి సమస్యలకు తావిస్తోంది. జిల్లాలో మితిమీరుతున్న పెద్ద మనుషుల పంచాయితీలను నియంత్రించి పేదలు మరింత ఇబ్బందుల్లో పడకుండా చర్యలు తీసుకోవాల్సి అవసరముంది.
ఫిర్యాదులు వస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. ఎక్కడైనా పెద్ద మనుషులు అనవసరంగా పంచాయితీల్లో జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవు. డిపాజిట్లు, ఇతరత్రా ఖర్చుల పేరిట డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – రాములు, డీఎస్పీ, మెట్‌పల్లి


