మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 మార్కెట్‌లో ప్రస్తుతం రూ.1700 నుంచి రూ.1800లే.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిరసనలు
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తోంది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 వరకు ఉండగా.. ఓపెన్ మార్కెట్‌లో మాత్రం రూ.1700 నుంచి రూ.1800కు మించడం లేదు. ఫలింగా రైతులు ఒక్కో క్వింటాల్‌పై కనీసం రూ.700వరకు నష్టపోతున్నారు. మద్దతు ధరతో పోల్చితే జిల్లా రైతులు దాదాపు రూ.49 కోట్ల మేర లాస్ అవుతున్నారు.
35 వేల ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈ సీజన్‌లో 35వేల ఎకరాల్లో మక్క సాగు చేసారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ఎకరాకు సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు 7 నుంచి 8 లక్షల క్వింటాళ్ల దిగుబది వచ్చే అవకాశం ఉంది. వానాకాలంలో వరి సాగు చేసిన పొలాల్లో యాసంగిలో మొక్కజొన్న వేసారు. హైబ్రిడ్ విత్తనాలు వాడటం, ఎరువుల, సాగునీటి యాజమాన్యం పాటించడంతో మంచి దిగుబడి వచ్చింది.
మొన్న రూ.2800, ఇప్పుడు రూ.1700
మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400. మొన్నటివరకు మద్దతు ధరను మించి క్వింటాల్‌కు రూ.2800 నుంచి రూ.3వేలు ధర పలికింది. రైతుల చేతికి పంట రాగానే రూ.వెయ్యి వరకు వరకు పడిపోయి.. ఏకంగా రూ.1700 నుంచి రూ.1800కి చేరింది. మక్కలు పూర్తిస్థాయిలో మార్కెట్‌కు వస్తే వ్యాపారులు రేటు మరింత తగ్గించే అవకాశాలు ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం.. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు.
వ్యాపారులు పెట్టిందే రేటు
మొక్కజొన్నను బిస్కెట్ పరిశ్రమలో.. కోళ్ల దాణాగా ఉపయోగిస్తుండటంతో డిమాండ్ ఉంది. ఇక్కడి కంటే తక్కువ రేటుకే ఇతర రాష్ట్రాల నుంచి వస్తోందంటూ దళారులు రేటు తగ్గిస్తున్నారు. వాస్తవంగా ఎకరా మొక్కజొన్న సాగుకు కనీసం రూ.25వేల నుంచి 30వేలు పెట్టుబడి అవుతుంది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ఒకే రేటుపై ఉండటం, రైతుల్లోని అనైక్యతను ఆసరాగా చేసుకుని ఇష్టం వచ్చిన రేటు పెడుతుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ సంస్థ రైతుల నుండి కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగితే, కనీసం వ్యాపారులు ఆ రేటు వరకై నా గ్రామాల్లో కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుంది.
రైతుల నిరసనలు
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రతి మండల కేంద్రాల్లో ఆందోళనలు చేసి, జిల్లాస్థాయిలో ఉద్యమించేందుకు రైతు నాయకులు సిద్ధం అవుతున్నారు.


