తాకత్‌కు మించి..పైసలు పంచి
గెలిచిన అభ్యర్థుల్లో సైతం భయాందోళన ఒక్కొక్కరి ఖర్చు రూ.20–రూ.30 లక్షలు పార్టీల నుంచి అందింది అంతంత మాత్రమే
మున్సిపల్ కౌన్సిలర్ పదవుల కోసం ఇష్టారాజ్యంగా ఖర్చు
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఖర్చు కౌన్సిలర్ అభ్యర్థులకు తడిచి మోపైడెంది. కౌన్సిలర్ పదవీ ఎలాగైనా దక్కించుకోవాలని ఒకరికి మించి ఒకరు ఖర్చు చేశారు. అటు ఓడిపోయిన అభ్యర్థులు అప్పులు ఎలా తీర్చాలని తలామునకలవుతుండగా గెలిచినవారు సైతం ఆందోళనలోనే ఉన్నారు. తాకత్‌కు మించి ఖర్చు పెట్టడంతో వాటిని ఎలా తీర్చాలనే సందిగ్ధంలో ఉన్నారు. కొందరు ఎన్నికల ఖర్చు కోసం విలువైన ఫ్లాట్లు, ఇళ్లకు సంబంధించిన కాగితాలు పెట్టి, బంగారం కుదవ పెట్టి ఖర్చు పెట్టారు. గెలిచిన అభ్యర్థులకు కొంత మేర ఊరట ఉన్నప్పటికీ ఓడినవారు మాత్రం తల పట్టుకుంటున్నారు. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో అత్యధికంగా ఖర్చు కాగా, రాయికల్, ధర్మపురిలో రూ.10 లక్షలకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది.
పోటాపోటీగా ఖర్చు..
కౌన్సిలర్ పదవుల కోసం ఒకరు ఓటుకు రూ.2 వేలు ఇస్తే మరొకరు రూ.4 వేలు ఇచ్చారు. ఇలా పోటాపోటీగా ఖర్చు పెట్టారు. జగిత్యాలలోని ఓ వార్డులో రూ.50 లక్షలకు మించి ఖర్చు చేసినట్లు, మరో ప్రముఖ నాయకుడు రూ.కోటికి పైగా ఖర్చు పెట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓడిపోయినట్లు చర్చ జరుగుతోంది. కొందరికి పెద్దగా సమస్య లేనప్పటికీ అప్పులు ఎలా కట్టాలన్న ధోరణిలో ఉన్నారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 655 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం రూ.20 నుంచి రూ.30 లక్షల ఖర్చు పెట్టారు. జగిత్యాలలో మాత్రం వింత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య తీవ్రమైన పోటీ జరగడంతో ఇటు ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు, అటు మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గీయులు సైతం ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో తీవ్రంగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో వార్డులో రూ.20– రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు అంచనా.
పార్టీల నుంచి అంతంతే..
ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులకు విరాళాలు కొంత మేరే వచ్చినట్లు అభ్యర్థులు పేర్కొన్నారు. నాయకులకు గుర్తింపుతో పాటు, ఆర్థిక బలం ఉంటేనే గెలిచే అవకాశాలుంటాయి. జగిత్యాలలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ కావడంతో ప్రధాన పార్టీల నుంచి కొంత మేరనే అందినట్లు తెలుస్తోంది. కొందరు చైర్మన్ పదవీ ఆశించిన వారు సైతం వార్డుల్లో వారి అభ్యర్థులను గెలిపించుకునేందుకు కొంత మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. ప్రధాన పార్టీ కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థికి రూ.లక్ష అందినప్పటికీ బీఆర్‌ఎస్, బీజేపీ వారు సైతం అందజేసినట్లు తెలిసింది.
అభ్యర్థులకు ఇవ్వలేదంటూ వైరల్
జిల్లా కేంద్రంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన అగ్రనాయకుడు అభ్యర్థులకు డబ్బులు ఇవ్వలేదనడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అధిష్టానం నుంచి ఒక అభ్యర్థికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు ఇవ్వాలని డబ్బులు వచ్చినా కొంత మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సంతకాల సేకరణ సైతం చేస్తున్నారు. ప్రధాన పార్టీలో ఈ విషయం ఎక్కడకు దారి తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
అప్పులు తీర్చేలా ప్రయత్నాలు
ఓడిపోయిన, గెలిచిన అభ్యర్థులు ఎలాగైనా అప్పులు లేకుండా చూసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాకట్టు పెట్టినవి అమ్మేసి, ఏవైనా ప్లాట్లు ఉంటే తీసేసి అప్పు తీసుకున్న వారి వద్ద చెల్లిస్తే కొంత మేర వడ్డీ తగ్గుతుందని భావిస్తున్నారు. కొందరైతే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎలాగైనా అప్పు తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


