శివరాత్రికి ముస్తాబైన పెగడపల్లి రాజన్న
పెగడపల్లి: మండలకేంద్రంలోని స్వయంభూ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఆలయానికి రంగులు వేసి, విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమష్టిగా రూ.50లక్షల విరాళాలు సేకరించి నిర్మాణం పూర్తిచేశారు. సత్యనారాయణ స్వామి, దుర్గామాతదేవి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, సూర్యుడు, నాగేంద్రుడు, బలిపీఠం విగ్రహాలు ప్రతిష్టించారు. ఇటీవల దేవాదాయశాఖ నుంచి రూ.50 లక్షలు మంజూరు కాగా రాజగోపురం నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. శివరాత్రి సందర్బంగా నాలుగు రోజులపాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. శివదీక్షాపరులతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియనుంది. 13న భూకలశ గణపతి పూజ, పుణ్యాహవచనం, 14న నవగ్రహ హోమాలు, కుంకుమపూజ, 15న స్వామివారి కల్యాణం, లింగోద్భవ దర్శనం, 16న బలిదానం, పూర్ణాహుతి, రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రామచంద్రం, ఉత్సవకమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు గుండి శ్రీనివాస్‌శర్మ, వినయ్‌శర్మ తెలిపారు.
శివరాత్రికి ముస్తాబైన పెగడపల్లి రాజన్న


